● అసైన్డ్ భూముల గుర్తింపు, రికార్డుల పరిశీలనలో పారదర్శకత పాటించాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ రూరల్: భూసేకరణ ప్రక్రియలో జాప్యం లేకుండా నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు సూచించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో భూసేకరణ ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూసేకరణ ప్రక్రియలో భాగంగా అసైన్డ్ భూములకు సంబంధించిన వివరాలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని, అసైన్డ్ భూమిగా పరిగణించేందుకు సంబంధిత అసైన్మెంట్ సర్టిఫికెట్, అసైన్మెంట్ ఫైల్, భూమి కేటాయింపు సమయంలో చేసిన నమోదు వంటి మూడు కీలక ఆధారాలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ ఎస్‌ఈ సీతారాం, ఎస్‌డీసీ పులిరాజు ఉండ్రాజ్వరపు, ఆర్డీఓలు గోపీరాం, కిరణ్ ప్రకాష్, అధికారులు పాల్గొన్నారు.
రుణ చెల్లింపుల నుంచి తాత్కాలిక
వెసులుబాటు కల్పించాలి
కరువు ప్రభావిత ప్రాంతాల్లో పంటనష్టాలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రైతులకు బ్యాంకు రుణాల పునర్నిర్మాణం, రుణ చెల్లింపుల వెసులుబాటు కల్పించేలా ఆర్బీఐ, ఎస్‌ఎల్‌బీసీ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను, బ్యాంకర్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు, సామాన్య ప్రజలను వడ్డీ వ్యాపారులు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు, పాన్ బ్రోకర్లు వేధించడం, అధిక వడ్డీలు వసూలు చేయడం, బలవంతపు రుణ వసూళ్లకు పాల్పడటాన్ని సహించేది లేదన్నారు. అలాగే వివిధ బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ పథకాల రుణ దరఖాస్తులను వారం రోజుల్లోగా పరిశీలించి, అర్హత మేరకు మంజూరు లేదా తిరస్కరణకు సంబంధించిన నిర్ణయాలను స్పష్టమైన కారణాలతో తెలియజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎల్‌డీఎం ప్రతిభ, డీఆర్‌డీఓ భాస్కర్, డీవీహెచ్‌ఓ మురళీధర్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోనీ, మెప్మా పీడీ హ ర్షవర్ధన్, డీసీఓ కరుణ, బ్యాంకర్లు, మండల వ్యవసాయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఓటరు జాబితాలో
పేరు నమోదుకు మరో అవకాశం
ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ 2026 ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాలో పేర్లు నమోదు కాని అర్హులైన ఓటర్లకు మరో అవకాశం కల్పించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి సర్ ప్రక్రియపై వీసీ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ చాంబర్ నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఈ వీసీలో పాల్గొన్నారు.


