కస్తూర్బాల్లో ప్రత్యేక పర్యవేక్షణ | - | Sakshi
Sakshi News home page

కస్తూర్బాల్లో ప్రత్యేక పర్యవేక్షణ

Nov 2 2026 1:11 AM | Updated on Nov 2 2026 1:11 AM

● ప్రతిరోజూ ఎంఈఓల తనిఖీలు

● విద్య, భోజనం, ఆరోగ్యం, పరిశుభ్రతపై నిరంతర నిఘా

● జిల్లా విద్యాశాఖ ప్రత్యేక చర్యలు

జనగామ: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆయా మండలాల పరిధిలో ఉన్న కేజీబీవీలను సంబంధిత మండల విద్యాధికారులు (ఎంఈఓలు) ప్రతిరోజూ ప్రత్యక్షంగా సందర్శించి పర్యవేక్షించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, మెరుగైన ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రమైన వసతి, భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు అధికారి సర్క్యులర్‌ ద్వారా ఉత్తర్వులు విడుదల చేశారు.

కలెక్టర్‌ తనిఖీల్లో గుర్తించిన లోపాలతో..

ఇటీవల కేజీబీవీని తనిఖీ చేసిన కలెక్టర్‌ పాఠశాలల పరిపాలన, నిర్ణీత ఆహార పట్టిక అమలు, పోషకాహారం, పరిశుభ్రత, విద్యార్థినుల ఆరోగ్యం, విద్యా పర్యవేక్షణలో కొన్ని లోపాలను గుర్తించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంచేందుకు పంపిణీ చేసిన ఫాస్ట్‌మ్యాథ్స్‌, గెట్‌ ఇట్‌ రైట్‌ పుస్తకాల అమలు ఆశించిన స్థాయిలో పెంచడంలో ఎంఈఓలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.

సమయాల వారీగా తనిఖీలు

ఎంఈఓలు ప్రతిరోజూ తప్పనిసరిగా కేజీబీవీలను సందర్శించాలి. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు విద్యార్థులు, సిబ్బంది హాజరు, అల్పాహారం, వంటగది పరిశుభ్రతను పరిశీలించాలి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతుల బోధన, ఆంగ్ల విద్య, గ్రంథాలయం, డిజిటల్‌ అభ్యసనాన్ని పరిశీలించాలి. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు భోజనం, కూరగాయలు, సరుకుల నాణ్యత, పరిమాణం, పోషకాహార ప్రమాణాలను తనిఖీ చేయాలి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యా ప్రగతి, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం, రికార్డులను పరిశీలించాలి. సాయంత్రం 6 గంటలకు ముందుగా రాత్రి భోజనం, వసతి గృహ హాజరు, పర్యవేక్షణతో కూడిన అధ్యయనం, విద్యార్థినుల భద్రతను తనిఖీ చేయాలి. ఈ సమయాలు సూచనాత్మకమైనవని, ప్రతిరోజూ ఒకే సమయంలో కాకుండా మారుస్తూ తనిఖీలు చేయాలని స్పష్టం చేశారు.

ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి

నిర్ణీత ఆహార పట్టిక ప్రకారం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం అల్పాహారం, రాత్రి భోజనం అందుతున్నాయా..? బియ్యం, పప్పులు, నూనె, కూరగాయలు సరిపడా ఉన్నాయా..? ఆహారం నాణ్యతగా ఉందా? అనేది పరిశీలించాలి. ఏఎన్‌ఎం సిబ్బంది సందర్శనలు, విద్యార్థినుల ఆరోగ్య పరీక్షలు, రక్తహీనత, రుతుక్రమ పరిశుభ్రత, ప్రథమ చికిత్స సదుపాయాలను తనిఖీ చేయాలి. పారిశుద్ధ్యం, తాగునీరు, మరుగుదొడ్లు, స్నానాల గదులు, వసతి గదుల నిర్వహణపై దృష్టి సారించాలి.

నిర్లక్ష్యానికి బాధ్యత వహించాల్సిందే

ఫాస్ట్‌ మ్యాథ్స్‌, గెట్‌ ఇట్‌ రైట్‌ తోపాటు ఆంగ్ల బోధన, ఖాన్‌ అకాడమీ, అన్‌అకాడమీ, ఫిజిక్స్‌వాలా వంటి డిజిటల్‌ అభ్యసన వేదికలు, గ్రంథాలయ వినియోగాన్ని పరిశీలించాలి. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, బోధన ప్రణాళికలు, సందర్శకుల వివరాలు, ఫిర్యాదుల నమోదు పుస్తకాలు తనిఖీ చేయాలి. వేధింపులు, వివక్ష, నిర్లక్ష్యం వంటి అంశాలు గుర్తిస్తే తక్షణమే ఉన్నతాధికారులకు నివేదించాలి. ప్రతి ఎంఈఓ రోజువారీ పర్యవేక్షణ రిజిస్టర్‌ నిర్వహించి, తనిఖీ వివరాలు, గుర్తించిన లోపాలు, తీసుకున్న చర్యలు, పరిష్కారానికి విధించిన గడువుతో కూడిన నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారికి సమర్పించాలి. ఆహారం, ఆరోగ్యం, భద్రత, పారిశుద్ధ్యానికి సంబంధించిన తీవ్రమైన లోపాలను వెంటనే నివేదించాలి. రోజువారీ తనిఖీల్లో నిర్లక్ష్యం, తప్పుడు నివేదికలు, లోపాలపై చర్యలు తీసుకోకపోవడం జరిగితే నిబంధనల ప్రకారం పరిపాలనా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

కేజీబీవీల్లో విద్యార్థినులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, మెరుగైన ఆరోగ్యం, పరిశుభ్రమైన వసతి, భద్రత కల్పించడమే లక్ష్యం. మండల విద్యాధికారులు ప్రతిరోజూ తనిఖీలు నిర్వహించి, లోపాలను గుర్తించి తక్షణమే పరిష్కరించాలి. పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

–సందీప్‌ కుమార్‌ ఝా, కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement