● నేను జనగామ ఫ్లైఓవర్‌ను,
శిథిలావస్థలో ఉన్నా పట్టించుకోరా?
● వాహనాల భారం..
ఆలనాపాలనా కరువు
● ప్రమాదం ముంచుకొస్తోంది,
పట్టించుకునే వారేరి
● రెయిలింగ్ విరిగింది..
మెట్లదారి కూలింది..
● దశాబ్దాల నా సేవలకు
ఇదేనా ప్రతిఫలం
● ఫ్లైఓవర్ ఆత్మఘోష
నేను జనగామ ఫ్లైఓవర్‌ను.. సుమారు మూడున్నర దశాబ్దాలుగా ఐదు రాష్ట్రాలకు జంక్షన్‌గా..ఈ ప్రాంత ప్రజలకు సేవలందిస్తున్నాను. ఒకప్పుడు నన్ను ఎంతో దృఢంగా నిర్మించారు. నేడు కాలం గడిచే కొద్దీ నా శరీరం శిథిలమవుతోంది. అయినా నా మీదుగా నిత్యం వందలాది వాహనాలు పరుగులు తీస్తూనే ఉన్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, గుజరాత్ వంటి రాష్ట్రాలకు వెళ్లే వాహనాలకు నేను కీలక మార్గంగా నిలుస్తున్నాను. కాకినాడ పోర్టు, విజయవాడ, సూర్యాపేట, సిద్దిపేట, మహారాష్ట్ర వైపు వెళ్లే వాహనాలు నా మీదుగా ప్రయాణిస్తున్నాయి. పారిశ్రామిక అవసరాలకు సంబంధించిన భారీ యంత్రాలతో కూడిన వాహనాలు సైతం ప్రతి నెలా పెద్ద సంఖ్యలో నాపై రాకపోకలు సాగిస్తున్నాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న నేను మాత్రం ఇప్పుడు నిర్లక్ష్యానికి గురవుతున్నాను.
నా మెట్లదారి శిథిలమై కూలిపోయింది. ఫుట్‌పాత్ దెబ్బతిని కుంగిపోయింది. రెయిలింగ్‌లు ఒక్కొక్కటిగా విరిగిపోతున్నాయి. రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. నా కింది భాగంలోని పెచ్చులు ఊడి ఇనుప చువ్వలు బయటకు కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఏ భాగం ఊడిపడుతుందోనన్న భయం నాలోనూ, నన్ను ఉపయోగించే ప్రజల్లోనూ నెలకొంది. నా రెయిలింగ్ రెండు వైపులా పెరిగిన రాగిచెట్లు కూడా నన్ను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వాటి కొమ్మలు నా నిర్మాణంలోకి చొచ్చుకువస్తున్నాయి. అప్పుడప్పుడు నామమాత్రంగా వాటిని తొలగిస్తున్నారు. కానీ శాశ్వత పరిష్కారం మాత్రం కనిపించడం లేదు. ఏళ్లుగా నా పరిస్థితిపై ప్రజలతో పాటు స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తునే ఉన్నాయి. నా వయసు ఎంత, నా నిర్మాణ సామర్థ్యం ఇంకా ఎంతకాలం ఉంటుంది, చిన్నచిన్న మరమ్మతులతోనే నేను మళ్లీ బలపడగలనా లేక నా స్థానంలో కొత్త వంతెన అవసరమా అన్నది నిపుణులు పరిశీలించాలి.
ఒకప్పుడు ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్న నేను ఇప్పుడు జాతీయ రహదారి పరిధిలోకి వచ్చాను. దీంతో నా ఆలనాపాలన ఎవరు చూడాలన్నది కూడా నాకు అర్థం కావడం లేదు. ఒక శాఖ నుంచి మరో శాఖకు బాధ్యతలు మారుతున్నా.. నా గోడు మాత్రం అలాగే ఉంది. రోజురోజుకూ నాపై వాహనాల రద్దీ పెరుగు తోంది. నా వయసు పెరుగుతోంది. నా శరీరం బలహీనపడుతోంది. అయినా అధికారులు నన్ను చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. నేను కూలిపోవాలని కాదు, మరో ప్రమాదం జరగకముందే నన్ను పరీక్షించాలని కోరుకుంటున్నాను. నా సామర్థ్యాన్ని నిపుణులతో అంచనా వేయండి. అవసరమైతే మరమ్మతులు చేయండి. పనికిరాని స్థితికి చేరితే ప్రత్యామ్నాయ వంతెన నిర్మించండి. మూడున్నర దశాబ్దాలుగా జనగామ ప్రజలకు సేవ చేసిన నా గోడును ఇకనైనా వినండి. నేను ప్రమాదంగా మారిన తర్వాత కాదు, ప్రమాదం జరగకముందే నన్ను కాపాడండి.
ఇట్లు
మీ జనగామ ఫ్లైఓవర్ ఆత్మఘోష
ఫ్లైఓవర్ రెయిలింగ్‌పై ప్రమాదకరంగా రావి చెట్లు


