జనగామ రూరల్: జనగామ, ఘన్‌పూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న చౌక ధరల దుకాణాల డీలర్ పోస్టులను భర్తీ చేసేందుకు కలెక్టరేట్‌లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పర్యవేక్షణలో రాత పరీక్షను ప్రశాంతంగా నిర్వహించారు. జనగామ రెవెన్యూ డివిజన్ పరిధిలో బచ్చన్నపేట మండలంలోని కేసిరెడ్డిపల్లి గ్రామం, దేవరుప్పుల మండలంలోని గొల్లపల్లి గ్రామం, జనగామ మండలంలోని చౌదర్‌పల్లి, పెద్దపహాడ్ గ్రామాలు, రఘునాథపల్లి మండలంలోని గోవర్ధనగిరి, రఘునాథపల్లి, ఎల్లారెడ్డిగూడెం, కోమల్ల, భాంజిపేట గ్రామాల్లో, అలాగే ఘనపూర్ (స్టేషన్) రెవెన్యూ డివిజన్ పరిధిలో కొడకండ్ల మండలంలోని లక్ష్మక్కపల్లి గ్రామం, పాలకుర్తి మండలంలోని ముత్తారం గ్రామాల్లో చౌక ధరల దుకాణాల డీలర్ పోస్టులు ఖాళీలకు గాను మొత్తం 126 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 115 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అర్హత సాధించిన 115 మంది అభ్యర్థుల్లో 111 మంది అభ్యర్థులు రాత పరీక్షకు హాజరుకాగా అనంతరం రాత పరీక్షకు హాజరైన 111 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీఓ గోపీరాం, ఉపాధి శాఖ అధికారి కుమారస్వామి, డీసీఎస్‌ఓ సురేష్ రెడ్డి, డీ సెక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు పరీక్ష..
జిల్లాలో 17 నూతన మీ–సేవ కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ కోసం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పర్యవేక్షణలో రాత పరీక్షను ప్రశాంతంగా నిర్వహించారు. ఈ నియామక ప్రక్రియకు మొత్తం 663 దరఖాస్తులు రాగా, పరిశీలన అనంతరం 638 మంది అభ్యర్థులు పరీక్షకు అర్హులుగా ఎంపికయ్యారు. పరీక్షకు అర్హత పొందిన 638 మందిలో 584 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా, 54 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. కార్యక్రమంలో డీ సెక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


