సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ మహానగర సమగ్రాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ‘గ్రేటర్’కు కీలకమైన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) నిర్మాణం కోసం రెండు రోజుల క్రితం రూ.5,257 కోట్లతో పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో యూజీడీతో పాటు ఇతర పనులను వేగవంతం చేయడంపై దృష్టి పెట్టింది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో వరంగల్ జిల్లా అభివృద్ధిపై రాష్ట్ర రెవెన్యూ శాఖ, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంత్రి కొండా సురేఖతో కలిసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి..
సమీక్ష సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరానికి దీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని, ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. వరంగల్ నగర అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. వరంగల్ నగర అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల అమలులో వేగం పెంచాలని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రాధాన్యం కలిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపట్టిన వివిధ ప్రగతి పనులు వచ్చే జూన్ 2వ తేదీ కల్లా పూర్తి కావాలని, సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు నిర్విరామంగా పనిచేయాలన్నారు.
యూజీడీకి టెండర్ పూర్తిచేయాలి..
వరంగల్‌లో చేపట్టే భూగర్భ డ్రెయినేజీ పనులకు సంబంధించి వెంటనే టెండర్ ప్రక్రియను పూర్తి చేసి వచ్చేనెలలో పనులను ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న రెండు పడక గదుల ఇళ్లకు ఈనెల 31లోగా లబ్ధిదారులను ఎంపిక చేసి కేటాయించాలని సూచించారు. రెండు పడక గదుల ఇళ్ల కాలనీల్లో కరెంట్, డ్రెయినేజీ, తాగునీరు, రోడ్లు వంటి కనీస సౌకర్యాలను ఆనాటి ప్రభుత్వం విస్మరించిందని తక్షణమే ఆయా కాలనీల్లో కనీస వసతులు కల్పించాలని పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలు పంపిస్తే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
‘సూపర్’ ఆస్పత్రిలో సిబ్బందిని నియమించాలి..
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు పూర్తి చేశామని, జూన్ నాటికి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఆస్పత్రి నిర్మాణ పనులు, ఆస్పత్రి సామగ్రి ఏర్పాటు, డాక్టర్ల నుంచి మొత్తం సిబ్బంది నియామకానికి సత్వరమే కార్యాచరణ పూర్తి చేయాలని ఆదేశించారు. భద్రకాళి ఆలయ అభివృద్ధి పనులు, భద్రకాళి చెరువు పూడికతీత అంశాలకు సంబంధించి ఆలయ మాడవీధుల్లో కృష్ణశిలతో నిర్మించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. భద్రకాళి చెరువు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో విషయంలో భూ సేకరణను వేగవంతం చేయాలన్నారు. గత ప్రభుత్వం ఆర్భాటంగా శంకుస్థాపన చేసి గాలికి వదిలేసిన ఇన్నర్ రింగ్‌రోడ్డు, ఔటర్ రింగ్‌రోడ్డు, పశ్చిమ నియోజకవర్గంలో మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భూసేకరణ వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరా జు, ఎమ్మెల్సీ సారయ్య, మేయర్ గుండు సుధారాణి, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు సత్యశారద, చాహత్ బాజ్‌పాయ్ తదితరులు పాల్గొన్నారు.
ఇన్నర్, ఔటర్ రింగురోడ్డు నిర్మాణం వేగవంతం
ఈ నెలాఖరులో అర్హులకు ‘డబుల్’ ఇళ్ల పంపిణీ
వరంగల్ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు
త్వరలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం
జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
సచివాలయంలో వరంగల్ అభివృద్ధిపై సమీక్ష
పాల్గొన్న ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు


