ప్రతీ గ్రామానికి సాగునీరు
● స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
జఫరగఢ్ : దేవాదుల ద్వారా ప్రతీ గ్రామానికి రెండు పంటలకు సాగునీరు అందించాలన్నదే తన ఏకై క లక్ష్యమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. మండలంలోని సాగరం గ్రామ శివారులో దేవాదుల ప్రాజెక్ట్ ఫేజ్ 3 ప్యాకేజీ ద్వారా 6 పనులను అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫేజ్ 3 కింద ప్యాకేజీ 6 పనులను 2027 నాటికి పూర్తి చేసేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నీటి పారుదల శాఖ సీఈ సుధీర్, ఎస్‌ఈ సీతారం, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక రైతు వేదిక భవనంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు.
బీఆర్‌ఎస్ నాయకుల వ్యాఖ్యలు సిగ్గుచేటు
స్టేషన్‌ఘన్‌పూర్: రెండు రోజుల క్రితం జనగామలో జరిగిన సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు ఆధారాలు లేకుండా చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. మండలానికి సంబంధించిన 66 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఏఎంసీ చైర్‌పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి, పార్టీ జిల్లా నాయకులు మంతెన ఇంద్రారెడ్డి, బూర్ల శంకర్, రజాక్‌యాదవ్, కొలిపాక సతీష్, సింగపురం వెంకటయ్య పాల్గొన్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్: మున్సిపాలిటీ ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా జరిగేలా అందరూ బాధ్యతగా పనిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ కార్యాలయాన్ని ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్, ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం జెడ్పీహెచ్‌ఎస్‌లో పోలింగ్‌స్టేషన్లను, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్, కౌంటింగ్ సెంటర్లను పరిశీలించారు. తహసీల్దార్ వెంకటేశ్వర్లు, కమిషనర్ బి.రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


