సంప్రదాయ సిరుల సంక్రాంతి
ఆరోగ్య సూత్రాలు..పిండివంటల ఘుమఘుమలు
జనగామ: దేశంలో జరుపుకునే పండగలన్నీ ఆరోగ్య సూత్రాలతో మిళితమై ఉన్నాయి. వేల సంవత్సరాల క్రితమే ఖగోళ శాస్త్రాన్ని ఔపోసన పట్టిన పండితులు, సూర్య, చంద్ర, నక్షత్రాల గ్రహ సంచార ఆధారంగా పండగలను ఏర్పాటు చేశారు. ఆ పండగల్లో ఉపయోగించే పద్ధతులు, పిండి వంటకాలు కూడా అక్కడి(మన) వాతావరణ విశేషాలను బట్టి నిర్ణయించారు. అలాంటిదే సంక్రాంతి పండగ. సంక్రాంతి విశేషాలను గమనిస్తే మనకు ఎన్నో విషయాలు ప్రస్ఫుటంగా తెలుస్తాయి. సూర్యుడు ధనూరాశి నుంచి మకరరాశిలో సంక్రమించే రోజునే సంక్రాంతి పండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పండగ విశేషాల్లో బియ్యం, రేగుపళ్లు, ఆవుపేడ, నువ్వులు, బెల్లం, చెరుకు గడ వంటి వస్తువులను ఉపయోగిస్తాం. వీటిని పరిశీలిస్తే నువ్వులు, బెల్లం, ఐరన్ శక్తిని అందిస్తాయి. అందుకే బెల్లంతో తయారు చేసిన వంటకాలను ఎక్కువగా చేస్తారు. రేగుపళ్లలో సీ విటమిన్ ఉంటుంది. ఎంతో శక్తివంతమైన ఆవుపేడతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని గుర్తించిన పూర్వీకులు ఇంటి ముందు కళ్లాపి చల్లి, గొబ్బెమ్మలను తయారు చేసి అలంకరించడం సంప్రదాయంగా వస్తోంది. వ్యవసా య ఆధారిత ప్రధాన దేశం కావడంతో ఈ సీజన్‌లో రైతన్న పండించిన పంటలను ఇంటికి చేర్చుకుంటాడు. భోగి రోజు చిన్నారులకు భోగి పండ్లు, సంక్రాంతి రోజున నోములు, కనుమరోజు పసుపు, పేరంటం చేసి ముత్తైదువలకు వాయినాలను ఇచ్చిపుచ్చుకుంటారు.
ఘుమఘుమలాడే పిండివంటలు
పెద్ద పండగ అంటే ఇంటికి, నోటికి సందడే. సంప్రదాయ చకినాలు, గారెలు, మురుకులు, అరిసెలు, లడ్డూలు, నువ్వుల ముద్దలు, రకరకాల పిండి వంటలు సంక్రాంతికి స్పెషల్‌గా నిలుస్తాయి. రుచిలో వేటికవే సాటి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ సంప్రదాయ పిండివంటలదే పైచేయిగా నిలుస్తోంది. కొత్త ధాన్యాలు, పల్లె పడతుల గొబ్బిళ్లు, డూడూ బసవన్నల ప్రదర్శనలతో ఊరంతా పేరంటమే అన్నట్లు సంక్రాంతి సంబురాలు రానే వచ్చాయి.
మొదలైన పండగ సందడి
మూడు రోజుల వేడుకకు సొంతూళ్లకు
సంప్రదాయ సిరుల సంక్రాంతి


