‘వివేక’ంతో పాలిస్తాం!
నేను బీటెక్ ఈసీఈ చదివాను. గ్రామాభివృద్ధికి ప్రజలతో మమేకమై సామాజిక కార్యక్రమాల చేస్తుండడంతో గ్రామంలో సర్పంచ్ నాకు అవకాశం కల్పించారు. నా భర్త మహిపాల్ బీజేపీ నాయకుడు. గ్రామ సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. గ్రామాభివృద్ధి కోసం స్పష్టమైన ప్రణాళిక ఉంది. భాష నగర్ తండా వెళ్లే రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తా. గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రమాద బీమా అందిస్తా. గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేస్తా..వివేకానందుడి స్ఫూర్తితో యువతలో ఆత్మస్థైర్యం పెంపొందించే కార్యక్రమాలు చేపడుతా..
– దాసరి అనూషమహిపాల్, సర్పంచ్, గానుగపహడ్, జనగామ మండలం
స్వామి వివేకానంద స్ఫూర్తితో గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని ఇటీవల సర్పంచ్‌లుగా గెలిచిన యువ సర్పంచ్‌లు చెబుతున్నారు. గ్రామంలోని యువత కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతామని, యువశక్తి సహకారంతో గ్రామాన్ని ప్రగతిపథాన నిలుపుతామని ఆకాంక్షిస్తున్నారు. ఈనెల 12న (సోమవారం) స్వామి వివేకానంద 163వ జయంతి (యువజన దినోత్సవం) సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం
– సాక్షి, నెట్‌వర్క్
నేను బీఫార్మసీ పూర్తి చేశా. చదువుతోపాటు గ్రామసేవ చేయాలనే తపన నన్ను 25 ఏళ్లకే రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. గ్రామస్తుల నమ్మకం, యువత మద్దతుతోనే సర్పంచ్‌గా ఎన్నికయ్యా. గ్రామంలో పోతన స్మారక మందిరం, ఆలేటి ఎల్లవ్వ ఆలయ అభివృద్ధి, గ్రామ అభివృద్ధి, మౌలిక వసతుల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకున్నా. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా పారదర్శకంగా అమలు చేస్తా. వివేకానందుడిని స్ఫూర్తిగా యువత చదువుతోపాటు గ్రామాభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేస్తా.
–జిట్టబోయిన రమ్య, సర్పంచ్, బమ్మెర, పాలకుర్తి
నేను ఇంటర్ వరకు చదివాను. తండా వాసుల సహకారంతో సర్పంచ్‌గా ఎన్నికల్లో నిలిచి గెలిచాను. గ్రామ సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తా. ప్రజల భాగస్వామ్యం, సహకారంతో గ్రామంలో డ్రైనేజీలు, రోడ్లు, వీధిదీపాలు తదితర సమస్యల్ని పరిష్కరించేలా కృషి చేస్తా. పదేళ్ల క్రితం ఏర్పడిన మా గ్రామపంచాయతీకి సొంత భవనం లేదు. త్వరలో నిర్మించేలా స్థానిక ఎమ్మెల్యే, గ్రామస్తుల సహకారంతో కృషి చేస్తా. యువత ఉపాధి కోసం కార్యక్రమాలు చేపడుతా.
–భూక్య అరుణారాంసింగ్,
సర్పంచ్, చంద్రుతండా, స్టేషన్‌ఘన్‌పూర్
నేను డాక్టర్ కావాలనే సంకల్పంతో నా తల్లిదండ్రులు బైపీసీ చదివిస్తే పరిస్థితులు అనుకూలించకపోవడంతో బీఎస్సీ డిగ్రీ చదివాను. కరోనా అనంతరం వ్యవసాయం చేస్తూ గ్రామంలోనే ఉంటున్నా. కాంగ్రెస్ పార్టీ యువజన విభాగంలో పని చేసే క్రమంలోనే తండావాసుల ఆశీర్వాదంతో ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యా. జీపీకార్యాలయం తదితర మౌలిక వసతులకు కావాల్సిన ప్రభుత్వ భూమి లేనందున నా సొంత ఖర్చులతో త్వరలో భూమి సేకరించి విరాళంగా ఇచ్చేందుకు కృషి చేస్తున్నా. వివేకానందుడి స్ఫూర్తితో గ్రామ యువశక్తిని గ్రామాభివృద్ధిలో వినియోగించుకుంటా.
–జాటోతు నవీన్‌నాయక్,
సర్పంచ్, పడమటితండా(డీ), దేవరుప్పుల
డిగ్రీ చదువును మధ్యలో మానేశా. 11 సంవత్సరాలుగా ఫొటోగ్రాఫర్‌గా పనిచేశా. కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడిగా ఐదేళ్లుగా పనిచేస్తున్నా. తాజా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లంతా అక్కున చేర్చుకొని ఆదరించడంతో సర్పంచ్‌గా ఎన్నికయ్యా. వారి నమ్మకాలను వమ్ము చేయకుండా గ్రామాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతా. యువత కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతా. గ్రామాభివృద్ధిలో వారి సహకారాన్ని తీసుకుంటా.
–ధరావత్ సుధీర్ నాయక్, సర్పంచ్, గిర్నితండా, కొడకండ్ల
‘వివేక’ంతో పాలిస్తాం!
‘వివేక’ంతో పాలిస్తాం!
‘వివేక’ంతో పాలిస్తాం!
‘వివేక’ంతో పాలిస్తాం!
‘వివేక’ంతో పాలిస్తాం!


