ఆర్డీఓ కార్యాలయ ఫర్నిచర్ జప్తు చేయండి
● భూ పరిహారం కేసులో కోర్టు ఆదేశం
● కార్యాలయానికి చేరుకున్న
భూయజమానులు
● ఆర్డీఓ లేకపోవడంతో వెనక్కి..
జనగామ: పట్టణంలో నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాల కోసం వినియోగిస్తున్న 18 ఎకరాల భూమికి ఇప్పటికీ పరిహారం అందలేదని ఆరోపిస్తూ, భూమి యజమానులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసిన జనగామ సీనియర్ సివిల్ కోర్టు, పరిహారం చెల్లించకపోవడంతో ఆర్డీఓ కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర వస్తువులను జప్తు చేయవచ్చని ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం కోర్టు ఉత్తర్వులతో భూమి యజమానులు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఆర్డీఓ అందుబాటులో లేకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. పట్టణంలోని సిద్దిపేటరోడ్డును ఆనుకుని 18 ఎకరాల స్థలం చెంచారపు కరుణాకర్‌రెడ్డి, దీప్తి, మధుసూదనరెడ్డి, శకుంతల, రామచంద్రారెడ్డి, రాజనరేందర్‌రెడ్డి, దివ్య, శోభ, సుభాషిణిలకు చెందిన 18 ఎకరాల భూమిని 1981లో గృహ నిర్మాణ శాఖ ఇళ్ల నిర్మాణం కోసం భూసేకరణలో తీసుకుకున్నారు. 1996లో ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ, భూ యజమానులు తక్కువ పరిహారం ఇచ్చేందుకు ప్రయత్నించబడిందని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణల్లో భూ యజమానులకు రూ.9.07 కోట్లు పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు పరిహారం చెల్లించకపోవడంతో వ్యవహారం మళ్లీ జనగామ సీనియర్ సివిల్ కోర్టుకు చేరింది. తాజాగా ఈ ఏడాది అక్టోబర్ 23న సీనియర్ సివిల్ జడ్జి సుచరిత, భూ యజమానులకు రూ.9.7కోట్లు పరిహారం చెల్లించాలని ఆర్డీఓను ఆదేశించగా, చెల్లింపునకు ఒక నెల గడువు ఇచ్చినా, అధికారులు స్పందించకపోవడంతో ఆర్డీఓ కార్యాలయంలోని వస్తువులను జప్తు చేయడానికి కోర్టు అనుమతి ఇవ్వగా, అడ్వకేట్‌తో కలిసి వారు వచ్చారు. ఈ సమయంలో ఆర్డీఓ అందుబాటులో లేకపోవడంతో బాధిత భూమి యజమానులు బుధవారం విచారణ ఉన్న నేపథ్యంలో, కోర్టు ఇచ్చే తదుపరి ఆదేశాలను అనుసరించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.


