
కొత్త కార్డులకు రేషన్
● సెప్టెంబర్ నుంచి పంపిణీకి చర్యలు
● జిల్లాలో 1.80 లక్షల రేషన్ కార్డులు
● కొత్త జాబితాలో 18,812 మందికి లబ్ధి
జనగామ: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతీఒక్కరికి ఆహార భద్రత (రేషన్) కార్డు అందిస్తోంది. గత ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాల కళ నెరవేరింది. పాత వారితో పాటు కొత్తగా కార్డులు వచ్చిన వారికి వచ్చే నెల (సెప్టెంబర్) నుంచి ఉచిత సన్నబియ్యం అందుకోనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం జిల్లాకు అదనపు కోటా కేటాయించగా పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తుంది. ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన తెల్ల రేషన్ కార్డులతో కలిపి జిల్లాలో మొత్తం 1,80,158 నమోదయ్యాయి. దీని ద్వారా 5,46,110 మందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందుకోనున్నారు.
ప్రభుత్వ నిర్ణయం మేరకు..
ప్రభుత్వ నిర్ణయం మేరకు మూడు నెలల కోటా పూర్తి కావడంతో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి జిల్లాలోని అన్ని రేషన్ షాపుల ద్వారా పాత, కొత్త కలిపి రెగ్యులర్‌గా లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. ప్రైవేట్ మార్కెట్‌లో సన్న బియ్యం ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో రోజు వారి కూలీలు, సామాన్య, పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుంది.
అధికారుల ఏర్పాట్లు
జిల్లాలో 335 రేషన్ దుకాణాలు ఉన్నాయి. జిల్లాలో 1,63,283 తెల్ల రేషన్ కార్డులు ఉండగా, సెప్టెంబర్ కోటా ప్రారంభం నాటికి 1,80,158కి చేరుకున్నాయి. ఇందులో కొత్తగా 18,812 ఉండగా, 5,46,110 (కొత్తవారు 50,976) మంది యూనిట్స్ (సభ్యులు) లబ్ధిపొందనున్నారు. వచ్చే నెల సన్న బియ్యం పంపిణీకి జిల్లాకు 3,470.358 మెట్రిక్ టన్నులు కేటాయించారు. జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ గోదాంల నుంచి బియ్యాన్ని రేషన్ దుకాణాలను పంపించేందుకు పౌర సరఫరాల శాఖ చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా బియ్యం నాణ్యతపై ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేసి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిఘా వేశారు.
రేషన్ దుకాణాలు: 335
రేషన్ కార్డులు: 1,80,158 లక్షలు
కొత్త కార్డులు: 18,812
లబ్ధిదారులు (యూనిట్స్): 5.46 లక్షల మంది
కొత్తగా చేరిన వారు : 50,976
బియ్యం అలాట్: 3,470.358 మెట్రిక్ టన్నులు