ధాన్యం కొనుగోళ్లలో చీటకోడూరు రికార్డ్
జనగామ రూరల్: స్థానిక మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన చీటకోడూరు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ఈ సీజన్ కొనుగోళ్లలో రికార్డు సృష్టించిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేవాల మేరకు జిల్లాలో సన్న, దొడ్డు రకం ధాన్యం కొనుకోళ్లకు ఐకేపీ, పీఏసీఎస్ కలిపి మొత్తం 258 కేంద్రాలను ఏర్పాటు చేసి సజావుగా కొనుగోళ్లను చేపట్టడం జరిగిందన్నారు. గత రజీ సీజన్‌లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డి. ఎస్ చౌహాన్ జిల్లాలోని పలు కేంద్రాలను సందర్శించి అక్కడ ఉత్పన్నమైన సమస్యల పరిష్కార మార్గాలను అధికారులకు వివరించారు. అవే సూచనలు ఈ సీజన్‌లో కూడా పాటిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లను చేపట్టడం జరిగిందన్నారు. ఈ రబీ సీజన్‌లో 497 మంది రైతుల నుంచి ఇప్పటి వరకు 38,104 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసి జిల్లాలోనే అత్యధిక ధాన్యం కొనుగోలు చేసిన కేంద్రంగా రికార్డు సృష్టించిందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రతీ గింజను కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు.


