
సాహితీ యాత్రకు ఘన స్వాగతం
పాలకుర్తి టౌన్: పాలమూరు జిల్లా తెలుగు పండిత సమూహం ఆధ్వర్యాన చేపట్టిన ‘సాహితీ యాత్ర’కు ఘన స్వాగతం లభించింది. తెలంగాణ తెలుగు పాఠ్యపుస్తక మండలి సభ్యుడు, కవి పండితుడు పల్లెర్ల రామమోహన్‌రావు నేతృత్వాన 23 మంది కవులు, పండితులు, ఉపాధ్యాయులు చేపట్టిన పాలకుర్తి సాహితీ యాత్ర–2025 శుక్రవారం ఇక్కడికి చేరుకుంది. సోమనాథ కళాపీఠం అధ్యక్షుడు డాక్టర్ రాపోలు సత్యనారాయణ, డాక్టర్ శంకరమంచి శ్యాంప్రసాద్, మార్గం లక్ష్మీనారాయణ, పోతన సాహిత్య కళావేదిక వ్యవస్థాపకులు మన్యాపు భూజేంద్ స్వాగతం పలికారు. అనంతరం యాత్ర బృందం పాల్కురికి సోమనాథుడు, బమ్మెర పోతన జన్మస్థలాలు, సోమనాథుడి స్మారక కేంద్రం, సోతన దున్నిన పోలాలు, ఆయన తల్లి లక్కమాంబ పేరుమీద ఏర్పడిన లక్క సముద్రం చెరువును, గూడూరులో 900 సంవత్సరాల శాసనాన్ని, పాలకుర్తి సమీపాన వాల్మీకి మహర్షి నడయాడిన నేల వల్మిడిని సందర్శించారు. ఈ సందర్భంగా పాలమూరు కవులను సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ శంకరమంచి శ్యాంప్రసాద్, కట్ట గిరిజారమణ శర్మ, అనిత, సిద్ధాంతి రాజశేఖరశర్మ, తిరపతమ్మ తదితరులు పాల్గొన్నారు.