సీఎంఆర్ అక్రమాలకు అడ్డుకట్ట సివిల్ సప్లయ్ శాఖ కఠిన నిబంధనలు బ్యాంకు గ్యారంటీతో పాటు మరో రెండు మిల్లుల హామీ తప్పనిసరి గడువులోగా బియ్యం ఇవ్వకుంటే బ్లాక్‌లిస్ట్.. జరిమానా, వడ్డీతో వసూలు నిబంధనలతో ధాన్యం తీసుకునేందుకు మిల్లర్ల విముఖత
జగిత్యాలరూరల్: కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం మిల్లర్లపై పూచీకత్తు నిబంధనలను కఠినతరం చేసింది. బ్యాంకు గ్యారంటీతో పాటు మరో రెండు మిల్లుల హామీ ఉంటేనే ధాన్యం కేటాయించనుంది. గడువులోగా బియ్యం అప్పగించకుంటే జరిమానా, వడ్డీతో వసూలు చేయడంతో పాటు మిల్లును బ్లాక్‌లిస్ట్‌లో పెట్టనుంది. ఈ నిబంధనలతో మిల్లర్లు ధాన్యం తీసుకునేందుకు వెనుకంజ వేస్తున్నారు. అయితే జిల్లాలో సన్నధాన్యం అధికంగా ఉండటంతో రైతులు చాలావరకు బహిరంగ మార్కెట్‌లోనే విక్రయిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రాక తగ్గడంతో కొత్త నిబంధనల ప్రభావం ప్రస్తుత సీజన్‌పై పెద్దగా కనిపించడం లేదు.
ముందస్తు ఒప్పందం.. రెండు మిల్లుల హామీ
గతంలో ధాన్యం కేటాయించిన తర్వాత సీఎంఆర్ ఒప్పందాలు చేసుకునేవారు. ఈ విధానంలో అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై చర్యలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు ఒప్పందాన్ని తప్పనిసరి చేసింది. గతేడాది కేటాయించిన ధాన్యంలో 10 శాతం మేర బ్యాంకు గ్యారంటీ సమర్పించాలి. మిల్లర్ల సంఘం హామీతో పాటు మరో రెండు మిల్లులు పూచీకత్తు ఇవ్వాలి. మిల్లు డిఫాల్ట్ అయితే హామీ ఇచ్చిన మిల్లుల నుంచి నష్టాన్ని వసూలు చేస్తారు. ఆస్తుల జప్తు, జరిమానాల నిబంధనలతో మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు.
కొనుగోలు కేంద్రాలకు తగ్గిన ధాన్యం
జిల్లాలో ఈ వానాకాలం సన్నరకం ధాన్యం అధికంగా సాగు కావడంతో రైతులు బహిరంగ మార్కెట్‌లో విక్రయాలకు మొగ్గుచూపుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రాక తగ్గడంతో మిల్లులకు కేటాయింపులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంతో కొత్త నిబంధనల ప్రభావం ప్రస్తుత సీజన్‌లో నామమాత్రంగా ఉండనుంది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు పంపకుండా గోదాముల్లో నిల్వ చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు.
గడువు దాటితే బ్లాక్‌లిస్ట్
ధాన్యం నిల్వల్లో తేడాలు వచ్చినా, పక్కదారి పట్టించినా 25 శాతం జరిమానాతో పాటు 12 శాతం వడ్డీ వసూలు చేయనున్నారు. గడువులోగా సీఎంఆర్ బియ్యం అప్పగించకపోతే మిల్లును బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి, బియ్యాన్ని వేలం వేసే అవకాశం ఉంది. ధాన్యం తీసుకున్నప్పటి నుంచి బియ్యం ప్రభుత్వానికి అప్పగించే వరకు పూర్తిబాధ్యత మిల్లర్లదే.
బ్యాంకు గ్యారంటీ తప్పనిసరి
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐకేపీ ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు కేటాయించాలంటే బ్యాంకు గ్యారంటీతో పాటు ఇద్దరు మిల్లర్ల పూచీకత్తు తప్పనిసరి. ఈ నిబంధనలు పాటించిన మిల్లులకే ధాన్యం కేటాయిస్తాం.
– జితేందర్‌రెడ్డి,
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి


