● బావిలో మునిగి యువకుడి దుర్మరణం ● నెల క్రితమే గల్ఫ్‌నుంచి సెలవుపై ఇంటికి రాక.. ● రాఘవపట్నంలో విషాద ఛాయలు
గొల్లపల్లి: కష్టాల కడలి దాటి.. గల్ఫ్‌దేశంలో ఎండనక.. వాననక రెక్కలు ముక్కలు చేసుకుని వచ్చిన కొడుకును ఓ ఇంటివాడిని చేయాలని ఆ తల్లిదండ్రులు ముచ్చటపడ్డారు. మంచి సంబంధం కుదిర్చి పెళ్లి చేద్దామనుకుంటున్న వేళ.. విధి వక్రించింది. రోజువారీ అలవాటు ప్రకారం సరదాగా ఈతకొడదామని బావిలోకి దిగిన ఆ యువకుడిని మృత్యువు బండరాళ్ల రూపంలో కాటేసింది. చేతికందివచ్చిన పెద్దకొడుకు విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల కడుపుకోత వర్ణనాతీతంగా మారింది. ఈ హృదయ విదారక ఘటన గొల్లపల్లి మండలం రాఘవపట్నంలో తీవ్ర విషాదం నింపింది.
ఉదయం వాకింగ్‌కు వెళ్లి..
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రాఘవపట్నం గ్రామానికి చెందిన ఆడెపు భూమయ్య పెద్ద కుమారుడు మధు (28). కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేందుకు ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లాడు. నెల క్రితమే సెలవుపై స్వగ్రామానికి చేరుకున్నాడు. మధుకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం వాకింగ్ వెళ్లే అలవాటున్న మధు.. మంగళవారం ఉదయం కూడా నడక కోసం బయలుదేరాడు.
బండరాళ్లు తగిలి తీవ్ర గాయాలు
వాకింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా గంగదేవిపల్లి శివారులోని వ్యవసాయ బావి కనిపించింది. సరదాగా ఈత కొడదామని బావిలోకి దిగాడు. నీటిలోకి దూకిన సమయంలో బావిలోని బండరాళ్లు అతడి తల, మోకాళ్లకు బలంగా తాకాయి. దీంతో తీవ్ర రక్తస్రావమై, నొప్పితో ఊపిరాడక బావిలోనే మునిగి ప్రాణాలు కోల్పోయాడు.
తల్లిదండ్రుల కన్నీరుమున్నీరు
భూమయ్యకు ముగ్గురు కుమారులు కాగా.. మధు పెద్దవాడు. మిగిలిన ఇద్దరు కుమారులు కూడా విదేశాల్లోనే ఉపాధి పొందుతున్నారు. కొడుకును పెళ్లిపీటలపై చూసుకోవాలని ఆశపడ్డ కన్నవారికి శోకమే మిగిలింది. ‘ఉదయమే నవ్వుతూ వెళ్లిన కొడుకు ఇలా శవమై తిరిగొస్తాడనుకోలేదే..’ అంటూ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు కన్నీరు పెట్టించింది. మృతుడి తండ్రి భూమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ఎం.కృష్ణసాగర్‌రెడ్డి తెలిపారు.


