జగిత్యాలఅగ్రికల్చర్: ఎల్‌నినో నేపథ్యంలో యాసంగిలో వరి సాగు చేస్తే రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుందని, పెసర, మినుము, అలిసంత వంటి పప్పు దినుసులు, వేరుశెనగ, నువ్వులు, ఆముదం వంటి నూనెగింజల పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి వడ్డెపల్లి భాస్కర్ తెలిపారు. ఎల్‌నినో ప్రభావం, యాసంగి పంటల సాగుపై ‘సాక్షి’తో పలు విషయాలు పంచుకున్నారు.
● ఎల్‌నినోతో వర్షాభావ పరిస్థితులు
నవంబర్ నెల నుంచి వచ్చే జూలై వరకు ఎల్‌నినో తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. వర్షాభావంతో కరువుఛాయలు అలుముకుంటాయి. బావులు, చెరువులు, కుంటలు ఎండిపోయే అవకాశం ఉంది. బావుల్లో ఉన్న కొద్దిపాటి నీటిని పొదుపుగా వాడుకోవాలి. సాగునీరు ఉన్న ప్రాంతాల్లో ఆరుతడి పంటలే సాగు చేసుకోవాలి. పంటలు చేతికందే దశలో నీరు ఇవ్వకుంటే పెట్టుబడి నష్టపోయే ప్రమాదం ఉంది.
● పడిపోతున్న సాగు
జిల్లా సాగు విస్తీర్ణం నాలుగు లక్షల ఎకరాలు. యాసంగిలో సాగు విస్తీర్ణం 2.50 లక్షలకు పడిపోయే అవకాశం ఉంది. గతేడాది యాసంగిలో మూడు లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే ఇప్పడు 1.50 లక్షల ఎకరాలకు పడిపోనుంది. మక్క 70 వేల ఎకరాలు, నువ్వులు 16వేలు, పెసర 3,456, పల్లి 1015, సజ్జ 1300, కూరగాయలు 1600 ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉంది.
● దిగుబడి తగ్గే అవకాశం
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆరుతడి పంట ల్లోనూ దిగుబడి తగ్గే అవకాశం ఉంది. అధిక ఉష్ణో గ్రతలతో పురుగులు, తెగుళ్లు ఆశించి పూత, మొగ్గ రాలిపోయే అవకాశం ఉంది. భూమిలో తేమ సరిపోక మొక్కలు వళ్లిపోతాయి. తక్కువ నీటితో సాగయ్యే పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలి. 2 నుంచి 3 నెలల్లో పూర్తయ్యే పంటను ఎంచుకోవాలి.
● సబ్సిడీపై విత్తనాల సరఫరా
ఆరుతడి పంటల్లో కొన్ని రకాల విత్తనాలను వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీపై సరఫరా చేస్తున్నాం. నువ్వు మూడు వేల ఎకరాలు, శనగ 30, మొక్కజొన్న వెయ్యి ఎకరాల వరకు పెసర, మినుము విత్తనాలను సబ్సిడీపై ఇవ్వాలని నిర్ణయించాం. జనుమును సీడ్ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీపై విత్తనాలు ఇవ్వడంతోపాటు, బై బ్యాక్ పద్ధతిలో మార్కెట్ ధరకు తీసుకునేలా ఒప్పందం చేసుకుంటాం.
● ఈనెల 30 వరకు అవగాహన సదస్సులు
యాసంగిలో సాగు చేసే పంటలు, ఎల్‌నినో ఎదుర్కోనే పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ కార్యక్రమం ఈనెల 30 వరకు కొనసాగనుంది. వరి సాగుతో కలిగే ఇబ్బందులు, ఆరుతడి పంటలు సాగు చేయడం ద్వారా కలిగే లాభాలను వివరిస్తున్నాం. మండల వ్యవసాయాధికారి, తహసీల్దార్, ఎంపీడీవో, ఎంపీవో, ఇరిగేషన్ ఏఈ, ఎన్‌పీడీసీఎల్ ఏఈ వంటి వారితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గ్రామాల్లో మరోసారి సమావేశాలు నిర్వహించేలా కలెక్టర్ కార్యాచరణ రూపొందించారు.
● కస్టమ్ హైరింగ్ సెంటర్లకు యంత్ర పరికరాలు
కస్టమ్ హైరింగ్ సెంటర్లకు వ్యవసాయంలో ఉపయోగించే డోజర్లు, రోటేవేటర్లు, లెవలింగ్ యంత్రాలు వంటి ఆధునిక యంత్రాలు ఇవ్వనున్నాం. ఇందులో పరికరం రేటును బట్టి అందులో 50 శాతం సబ్సిడీ ఇవ్వనున్నాం. ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీలు, మహిళా సంఘాలకు ఇవ్వాలని నిర్ణయించాం. జిల్లాకు 11 యూనిట్లు మంజూరు అయ్యాయి.
● అనుబంధ రంగాలపై ప్రధాన దృష్టి
పాడి, కోళ్ల పరిశ్రమ, పుట్టగొడుగులు, చేపల పెంపకం వంటి అనుబంధ రంగాల వైపు రైతులను మళ్లించేలా దృష్టి పెట్టాం. లబ్ధిదారులకు నాబార్డు, బ్యాంకుల ద్వారా రుణాలు అందించేలా చూస్తున్నాం. కర్భూజ వంటి పండ్లతోటల ద్వారా కూడా ఆదాయం వస్తుంది. ఎరువులను యాప్ ద్వారా బుక్ చేసుకోవాలి. జిల్లాకు 50 వేల టన్నుల యూరియా, 9 టన్నుల డీఏపీ, 2వేల టన్ను సూపర్, 38వేల టన్నుల కాంప్లెక్స్ ఎరువులు సిద్దంగా ఉంచాం.


