జగిత్యాలటౌన్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ సత్యప్రసాద్ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ ప్రసూనాంబ, డీఆర్‌వో ప్రసాద్, డీపీవో మదన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.
భూసేకరణ నిలిపివేయండి
నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి సర్వాపూర్, గుడిపేట, ముత్యంపేట మీదుగా మల్యాల రాముని చెరువు నింపేందుకు కాలువ కోసం భూసేకరణ సర్వే చేస్తున్నారు. వరదకాలువ, రైల్వేలైన్, ఎన్‌హెచ్–563 కోసం ముత్యంపేటలో 600ఎకరాలు కోల్పోయాం. మరోసారి భూసేకరణ చేస్తే ఉన్నకొద్ది భూమి కూడా కోల్పోతాం. పోతారం చెరువు నుంచి గొలుసుకట్టు చెరువుల ద్వారా రామునిచెరువు నింపే అవకాశం ఉంది.
– ముత్యంపేట రైతులు
అసైన్డ్‌భూమి బదిలీ
గ్రామంలోని సర్వేనంబర్17లో 14.22 ఎకరాల భూమిని 1950లో ప్రభుత్వం దళితులకు పంపిణీ చేసింది. బై నంబర్లతో న్యావనంది రాజగంగుకు 2.11 ఎకరాలు, రవితేజకు 16గుంటలు, రవిచరణ్ కు 16గుంటలు, రాజశేఖర్‌కు ఏడు గుంటలు, రాజేశ్‌కు 8గుంటలు బదిలీ చేశారు. ఆ భూమిని అక్రమంగా బదిలీ చేసిన వారిపై చర్యలు తీసుకోండి.
– పూదరి నాగరాజు, రేగుంట, మెట్‌పల్లి
పంట కాలువలోకి
మిల్లు వ్యర్థాలు
మల్యాల మండలం తక్కళ్లపల్లి పరిధిలోని శ్రీగణేశ్ ఇండస్ట్రీస్ రైస్ మిల్లు వ్యర్థాలు పక్కనే ఉన్న పంట కాలువలోకి వదులుతున్నారు. చేపలు, పశువులు, పర్యావరణంపై ప్రభావం పడుతోంది. పంచాయతీ నుంచి నోటీసులు పంపించినా మిల్లు యజమాని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. వ్యర్థాలు కాలువలోకి వదలకుండా చర్యలు తీసుకోండి.
– తక్కళ్లపల్లి గ్రామస్తులు
‘దళితబంధు’ ఇప్పించండి
2023లో అప్పటి ప్రభుత్వం దళితబంధు కింద మాకు తొలి విడత రూ.రెండు లక్షలు విడుదల చేసి కలెక్టర్ అకౌంట్లో జమచేసింది. ఎన్ని కల కోడ్‌తో తాత్కాలికంగా నిలిచిపోయింది. ప్రస్తుతం రెండో విడత దళితబంధు విడుదల చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాకు నిధులు జమయ్యేలా చూడండి.
– కథలాపూర్ మండల దళితులు
దారిని పునరుద్ధరించండి
గ్రామ శివారులోని సర్వేనంబర్ 236లోకి వెళ్లే 15 అడుగుల దారికి అడ్డంగా రాళ్లగోడ, ఇనుప ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఆక్రమించుకున్నారు. మా భూములకు వెళ్లేదారిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకుని రోడ్డును పునరుద్ధరించి న్యాయం చేయండి.
– బల్మూరి విద్యాసాగర్‌రావు, మానాల, మల్యాల


