రామగిరి ఖిల్లాకు రోప్‌వే | - | Sakshi
Sakshi News home page

రామగిరి ఖిల్లాకు రోప్‌వే

Oct 18 2026 1:54 AM | Updated on Oct 18 2026 1:54 AM

పర్వతమాల పరియోజన కింద మంజూరు చేసిన కేంద్రం

2.1 కిలోమీటర్ల రోప్‌వేకు రూ.5 కోట్ల నిధులు

రాష్ట్రంలో మరో నాలుగు చోట్ల ఏర్పాటుకు డీపీఆర్‌ సిద్ధం

మారనున్న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పర్యాటక రూపు

చారిత్రక రామగిరి కోటకు అరుదైన గుర్తింపు

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని చారిత్రక రామగిరి ఖిల్లాకు రోప్‌వే రానుంది. పర్వతమాల పరియోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఓ ప్రైవేటు సంస్థకు టెండర్‌ అప్పగించేందుకు సిద్ధమైంది. మొత్తం 2.1 కిలోమీటర్ల దూరం మేరకు నిర్మించనున్న ఈ రోప్‌వే కోసం రూ.5.23 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం ఐదు చోట్ల రోప్‌వే ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో నాగార్జున సాగర్‌ పరిధిలోని నాగార్జున కొండ (చారిత్రక బౌద్ధ క్షేత్రం), యాదగిరి గుట్ట (యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి ఆలయం), రామగిరి ఖిల్లా (పెద్దపల్లి జిల్లా), హనుమాన్‌ హిల్‌ (నల్లగొండ జిల్లా), డిచ్‌పల్లి (నిజామాబాద్‌) ఉన్నాయి. ఈ ఐదు చోట్ల రోప్‌వేలకు కేంద్రం రూ.1,230 కోట్ల అంచనా వ్యయంతో ఆమోదం తెలిపింది. ఈ ఐదింట్లో మొట్టమొదటిసారిగా హర్యానాకు చెందిన సివిల్‌ మంత్రా ఇన్‌ఫ్రాకాన్‌ లిమిటెడ్‌ అనే పేరు గల సంస్థకు లెటర్‌ ఆఫ్‌ అవార్డ్‌ వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు నేషనల్‌ హైవేస్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌ సదరు కాంట్రాక్టు సంస్థ బిడ్‌ను సెప్టెంబరులోనే అధికారికంగా ఆమోదించినట్లు తెలిసింది. మిగిలిన రోప్‌వేలకు ప్రస్తుతం డీపీఆర్‌ పనులు సాగుతున్నాయి. అవి పూర్తయిన అనంతరం పనులు మొదలవుతాయి.

ఖిల్లాది ఘనమైన చరిత్ర

పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని రామగిరి ఖిల్లా ప్రకృతి అందాలకు, అద్భుత శిల్పకళకు నెలవు. పెద్దపల్లి నుంచి 18కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ రోప్‌వే నిర్మించడం వల్ల పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. రామగిరి కోటకు ఘనమైన చరిత్ర ఉంది. త్రేతా యుగంలో రాముడు అయోధ్య నుంచి లంకకు వెళ్లేటప్పుడు ఇక్కడ సేద తీరాడని రామాయణ ఇతిహాసంలో ఉంది. ప్రాచీన సంస్కృత కవి కాళిదాసు మేఘసందేశంలో రామగిరి ఖిల్లా గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఐటీపరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఖిల్లా చుట్టూ రోడ్ల నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయించారు. రామగిరి, ముత్తారం మీదుగా వరంగల్‌కు ఎన్‌హెచ్‌ 63 (నాగపూర్‌ నుంచి విజయవాడ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌) వేస్తున్నారు. పెద్దపల్లి నుంచి కునారం మీదుగా ముత్తారం నుంచి భూపాలపల్లికి మరో రాష్ట్ర రహదారికి ప్రతిపాదన ఉంది. ప్రధాన మంత్రి సడక్‌ యోజన కింద అమ్రాబాద్‌ నుంచి ముత్తారం మండలం పారుపల్లి వరకు రోడ్డు నిర్మాణం మొదలైంది. ఈ రోడ్డులో ముత్తారం మండలంలో రెండు వంతెనలు నిర్మిస్తున్నారు. ఒక్కో బ్రిడ్జికి రూ.2.50 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

ఎంపీ చొరవతో..

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రామగిరి ఖిల్లాపైకి రోప్‌వే ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి గడ్కరిని పలుమార్లు కోరారు. ఖిల్లా చరిత్ర, శిల్పకళ, ప్రకతి అందాల గురించి ఒక రిపోర్ట్‌ తయారు చేసి నివేదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుకున్నది జరిగితే రామగిరి మండలంతో పాటు పెద్దపల్లి, మంథని, ముత్తారం, కాల్వ శ్రీరాంపూర్‌ మండలాలు అభివృద్ధి చెందుతాయి. పెద్దపల్లి జిల్లాలో రవాణా, టూరిజం ద్వారా వ్యాపార పరంగా అభివృద్ధి జరగనుంది. రైలు, రోడ్డు కనెక్టివిటీ దండిగా ఉన్న రామగిరి ఖిల్లా ప్రాంతానికి రోప్‌ వే మంజూరుకావడంపై ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement