రాయికల్: సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థ పాలనతోనే రాష్ట్రంలో విద్యుత్, సాగునీటి సమస్య ఎదురైందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. రాయికల్‌లో శనివారం విలేకరులతో మాట్లాడారు. తుమ్మడిహెట్టి బ్యారేజీ నిర్మిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఊసే ఎత్తడం లేదన్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని తెలంగాణలో అధిగమించే అవకాశం ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మేడిగడ్డ వినియోగంలోకి తెస్తే కేసీఆర్‌కు ఎక్కడ పేరు వస్తుందోనని ప్రభుత్వం మరమ్మతు చేపట్టడం లేదని తెలిపారు. ఇప్పటికే లక్షలాది క్యూసెక్కుల నీరు వృథాగా పోతోందని, ప్రభుత్వం కళ్లు తెరిచి నెల రోజుల్లో కాపర్‌డ్యామ్ నిర్మాణం చేపట్టాలని కోరారు. యాసంగిలో ప్రభుత్వం వరిపంట వేసుకోవద్దని ప్రకటించడం దురదృష్టకరమన్నారు.
యాసంగికి నీరందించి రైతులను ఆదుకోవాలి
రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం యాసంగికి సాగునీరందించాలని, ఈనెల 31 వరకు విడుదల చేయాలని జీవన్‌రెడ్డి అన్నారు. అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు మంత్రి పదవి రాగానే.. రాష్ట్రమంతా మంచిగా ఉందంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రజాకోణంలో కూడా ఆలోచన చేయాలని హితవు పలికారు. విద్యుత్ సమీక్షపై కోరుట్ల ఎమ్మె ల్యే సంజయ్‌కుమార్ రేవంత్‌రెడ్డితో మాట్లాడితే ఉలిక్కిపడ్డారని ఎద్దేవా చేశారు. రోళ్లవాగులో 0.25 టీఎంసీ నీటిని నింపితే బీర్పూర్, ధర్మపురి మండలాలకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. మోతె చెరువు మత్తడి తెగి నాలుగేళ్లయినా రూపాయి విడుదల చేయాలేదని గుర్తుచేశారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మున్సిపల్ చైర్మన్ కట్కం రవి, బీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు అనిల్, మల్లేశ్, కో–ఆర్డినేటర్ తురగ శ్రీధర్‌రెడ్డి, నాయకులు గోపి రాజిరెడ్డి, బత్తిని నాగరాజు, ఎనుగంటి రవి, మహేశ్‌గౌడ్, మండ రమేశ్, ఆనందరావు, సంతోష్, సాగర్ పాల్గొన్నారు.


