బాధిత కుటుంబానికి రూ.6లక్షల చెక్కు | - | Sakshi
Sakshi News home page

బాధిత కుటుంబానికి రూ.6లక్షల చెక్కు

Oct 15 2026 8:48 AM | Updated on Oct 15 2026 8:48 AM

జగిత్యాల: రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన హస్నాబాద్‌ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్‌గౌడ్‌ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు. బుధవారం రూ.6 లక్షల చెక్కును ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో కలిసి సుదర్శన్‌ కుటుంబానికి అందించారు. ఉపాధి కోసం నాలుగు నెలల క్రితం ఉక్రెయిన్‌ వెళ్లిన సుదర్శన్‌ అక్కడ కొనసాగుతున్న యుద్ధంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.

వరదకాలువకు తగ్గిన ప్రవాహం

జగిత్యాలఅగ్రికల్చర్‌: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి వరదకాలువకు నీటి విడుదలను 4500 క్యూసెక్కులకు తగ్గించారు. మూడు రోజులుగా కాకతీయ కాలువకు ఆరు వేల క్యూసెక్కుల చొప్పున విడుదల చేయగా.. బుధవారం 500 క్యూసెక్కులు తగ్గించారు. ప్రాజెక్టు నుంచి మొత్తంగా రోజుకు 12,043 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 42.534 టీఎంసీల నీరు ఉంది.

విద్యుత్‌ కోతలకు నిరసనగా రోడ్డెక్కిన రైతులు

ఇబ్రహీంపట్నం: విద్యుత్‌ కోతలను నిరసిస్తూ.. మండలంలోని కోమటికొండాపూర్‌ గ్రామ రైతులు వర్షకొండ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద రోడ్డుపై ఆందోళనకు దిగారు. త్రీఫేజ్‌ విద్యుత్‌ నిరంతరాయంగా సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయానికి వేళాపాళా లేకుండా కోతలు పెడుతుండడంతో పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. సబ్‌స్టేషన్‌ నుంచి కోమటికొండాపూర్‌ వరకు రెండు ఫీడర్ల ద్వారా త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా అయ్యేదని, ఇప్పుడు ఒకే ఫీడర్‌ ద్వారా ఇస్తుండడంతో లో వోల్టేజీతో మోటార్లు కాలిపోతున్నాయని తెలిపారు. విద్యుత్‌ సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. సర్పంచ్‌ పద్మజ, ఉపసర్పంచ్‌ సాగర్‌, రైతులు శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

చదువుతోనే ఉన్నత లక్ష్యాలు సాధించవచ్చు

జగిత్యాలజోన్‌: బాలికలు చదువుతోనే ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి మట్ట సరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలల సంరక్షణ గృహంలో అంతర్జాతీయ బాలిక దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. బాలికలు విద్యకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, వారికి చిన్న వయస్సులో పెళ్లి చేయొద్దని తల్లిదండ్రులకు సూచించారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చన్నారు.

అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌ బదిలీ

జగిత్యాల: అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) రాజాగౌడ్‌ నిజామాబాద్‌కు బదిలీ కాగా.. బుధవారం ఆయనకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. కలెక్టర్‌ సత్యప్రసాద్‌ మాట్లాడుతూ.. జిల్లాను ముందంజలో ఉంచడంలో ఆయన కృషి మరువలేమన్నారు. వివిధ శాఖల అధికారులు రాజాగౌడ్‌ను సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement