నిధులు రావు.. సేవలు కరువు | - | Sakshi
Sakshi News home page

నిధులు రావు.. సేవలు కరువు

Oct 24 2026 12:22 AM | Updated on Oct 24 2026 12:22 AM

● నిరుపయోగంగా రైతు విజ్ఞాన కేంద్రాలు ● రైతులకు అవగాహన, సాగుపై శిక్షణ ఇవ్వడం దీని లక్ష్యం ● కనీస వసతులు లేక సేవలు దూరం

● నిరుపయోగంగా రైతు విజ్ఞాన కేంద్రాలు ● రైతులకు అవగాహన, సాగుపై శిక్షణ ఇవ్వడం దీని లక్ష్యం ● కనీస వసతులు లేక సేవలు దూరం

జగిత్యాలఅగ్రికల్చర్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సాగు సాంకేతికను రైతులకు చేరవేసేందుకు ప్రభుత్వ సహకారంతో రెండేళ్ల క్రితం ఉమ్మడి జిల్లాకు 4 రైతు విజ్ఞాన కేంద్రాలు మంజూరు చేసింది. కానీ, కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ స్థలాలు లేక, ప్రభుత్వ భవనాల్లో ఏదో మూలకు ఓ కార్యాలయం ఏర్పాటు చేసి మమ అనిపిస్తున్నారు. సరైన నిధులు, కనీస వసతులు లేక రైతులకు విజ్ఞాన కేంద్రం సేవలు కరువయ్యాయి. రైతులకు అవి ఎక్కడ ఉంటాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

సిబ్బంది కొరత

ప్రతీ రైతు విజ్ఞాన కేంద్రానికి కనీసం ముగ్గురు శాస్త్రవేత్తలు, ఒక్కరిద్దరు కార్యాలయ సిబ్బంది ఉండాలి. కాగా, ప్రస్తుతం వివిధ వ్యవసాయ పరిశోధన స్థానాల్లో పనిచేస్తున్న వారిలో ఒక్కరిద్దరిని రైతు విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్లుగా నియమించారు. ఇతర శాస్త్రవేత్తలను, అసిస్టెంట్లను నియమించలేదు. జగిత్యాల జిల్లాకు మంజూరైన రైతు విజ్ఞాన కేంద్రాన్ని పొలాస పరిశోధన స్థానంలోని ఓ గదిలో నిర్వహిస్తున్నారు. కేవలం ఒక శాస్త్రవేత్తను కోఆర్డినేటర్‌గా నియమించారు. మిగతా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు పెద్దగా నిధులు విడుదల చేసిన దాఖలాలు లేవు. ఏమైనా నిధులు ఇస్తే, అవి కేవలం కార్యాలయంలో కంప్యూటర్లు, టేబుళ్లు, కుర్చీలకే సరిపోయాయి. రైతు విజ్ఞాన కేంద్రాల్లో వ్యవసాయ ప్రదర్శనలు ప్రారంభమైతే జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి నుంచి కూడా నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది.

ప్రతీ కేంద్రానికి 30 ఎకరాలు

ప్రతీ రైతు విజ్ఞాన కేంద్రానికి కనీసం 30 ఎకరాల స్థలం అవసరం. సాగు నీటి వసతి ఉండి, వ్యవసాయానికి యోగ్యంగా ఉండేలా భూమి ఉండాలి. వ్యవసాయ పరిశోధన స్థానాల్లో శాస్త్రవేత్తలు రూపొందించిన విత్తనాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, కొత్త పంటల నమూనాలను రైతు విజ్ఞాన కేంద్రాల్లో రైతులకు ప్రదర్శించాల్సి ఉంటుంది. అలాగే రైతులు, గ్రామీణ యువతకు, వ్యవసాయాధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించడానికి కేంద్రం నిర్మించాల్సి ఉంటుంది. మట్టి పరీక్షలు, తెగుళ్ల ప్రాథమిక నిర్ధారణ కోసం ప్రత్యేక ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి. కిసాన్‌మేళాలు, రైతు సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. రైతులు సాగు చేసిన పంటల్లో తెగుళ్లు ఆశించినప్పుడు గ్రామాలకు వెళ్లి పొలాల సందర్శనతో పాటు సమావేశాలు నిర్వహించాలి. ప్రభుత్వ స్థలాల కోసం కేంద్రం కోఆర్డినేటర్లు రైతుల సహకారంతో ఎమ్మెల్యేలు, మంత్రులను కలిసి విన్నవిస్తూనే ఉన్నారు. కానీ, ఎలాంటి సదుపాయాలు లేక రైతు విజ్ఞాన కేంద్రాల సేవలు అందని ద్రాక్షగా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement