పెగడపల్లి: ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇంటి ని ర్మాణం చేపడుతున్న కబ్జాదారుడికి సహకరిస్తున్న అ ధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని ల్యాగలమర్రి దళితులు డిమాండ్ చేశారు. శుక్రవారం మండలకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎస్సీ కాలనీలో ఆట స్థలానికి కేటాయించిన ప్రభుత్వ భూ మిలో ఇంటి నిర్మాణానికి పంచాయతీ కార్యదర్శి, ఎంపీవో, తహసీల్దార్ సహకరిస్తున్నారని, అక్రమ ఇంటి నిర్మాణంపై రెండేళ్లుగా ఆందోళనలు చేస్తున్నామని, మంత్రితోపాటు, కలెక్టర్, ఆర్డీవో, డీపీవోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 6కు బదులుగా 240 వేసి ఇంటి నిర్మాణం చేపడుతున్నారని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఎస్సై కుమారస్వామి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఘటనా స్థలానికి చేరుకొని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఆందోళన విరమింపజేశారు.


