దర్జాగా దారిపైకి.. | - | Sakshi
Sakshi News home page

దర్జాగా దారిపైకి..

Oct 24 2026 12:22 AM | Updated on Oct 24 2026 12:22 AM

● ఆస్పత్రులు, దుకాణాల ఎదుట ఇష్టారీతిగా నేమ్‌బోర్డులు, ఫ్లెక్సీలు ● ట్రాఫిక్‌ జామ్‌తో వాహనదారుల ఇబ్బందులు

జగిత్యాల: జిల్లా కేంద్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుండడంతో ఆస్పత్రులు, సూపర్‌మార్కెట్లు, కిరాణాలు, స్కానింగ్‌ సెంటర్లు, వాణిజ్య వ్యాపారాలు అత్యధికంగా వెలుస్తున్నాయి. ముఖ్యంగా కొత్తబస్టాండ్‌ నుంచి టవర్‌సర్కిల్‌, తహసీల్‌ చౌరస్తా నుంచి జంబిగద్దె, జంబిగద్దె నుంచి అశోక్‌నగర్‌, పాతబస్టాండ్‌ ఏరియాల్లో అత్యధికంగా వాణిజ్య సముదాయాలు ఏర్పడ్డాయి. సదరు యజమానులు దుకాణాల ఎదుట రోడ్డును ఆనుకుని పెద్దపెద్ద రాడ్‌లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. పలుచోట్ల బోర్డులను రోడ్డుపై పెట్టి రాత్రిపూట షాపులు కట్టేసే ముందు లోపల పెడుతున్నారు. కాగా, కొందరైతే రాడ్‌లను భూమిలో పాతి పకడ్బందీగా బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. కొందరు రేడియం లాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో రాత్రిపూట వాటి రిఫ్లెక్షన్స్‌తో ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డును ఆనుకుని ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండడంతో ట్రాఫిక్‌ సమస్య నెలకొంటోంది.

టౌన్‌ప్లానింగ్‌ ఎక్కడ?

జిల్లాకేంద్రంలో పలు వాణిజ్య సముదాయాలు, ఆస్పత్రుల ఎదుట రోడ్లను ఆనుకుని బోర్డులు ఏర్పాటు చేస్తున్నా టౌన్‌ప్లానింగ్‌ అధికారులు మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడైనా అక్రమంగా నిర్మాణాలు చేపడితే వెంటనే కూల్చివస్తారే గానీ, బోర్డులు ఏర్పాటు చేస్తే పట్టించుకోవడం లేదు. దీంతో ఎక్కబడితే అక్కడ బోర్డుల మయంగా మారింది.

పార్కింగ్‌ ఇబ్బంది

అసలే ఇరుకై న రోడ్లు, రోడ్లను ఆనుకుని బోర్డులు ఏర్పాటు చేయడంతో ఆస్పత్రులకు, ఇతర పనులకు వచ్చే వాహనదారులు ట్రాఫిక్‌తో ఇబ్బందిపడుతున్నారు. అత్యవసర సమయంలో ఫోర్‌ వీలర్‌ వాహనాలు, ఆటోలు వెళ్లలేని పరిస్థితి నెలకొటోంది. ముఖ్యంగా ఆస్పత్రుల ఏరియాల్లో అయితే నేమ్‌ బోర్డులు ఎక్కడపడితే అక్కడ పెడుతున్నారు. దీంతో ప్రమాదాలు సైతం చోటుచేసుకుంటున్నాయి.

రోడ్లు కబ్జా

దర్జాగా రోడ్లను ఆనుకుని బోర్డులు పెట్టడం, రేకులషెడ్లు నిర్మించడం వంటివి యథేచ్ఛగా జరుగుతున్నాయి. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటాం

రోడ్లను ఆనుకుని బోర్డులు పెట్టవద్దు. ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయి. పార్కింగ్‌కు సైతం ఇబ్బందికరంగా ఉంటుంది. నోటీసులు ఇస్తాం. యాజమాన్యాలు వారి పరిధిలోనే బోర్డులు ఏర్పాటు చేసుకోవాలి. రోడ్లను ఆనుకుని ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటాం.

– శ్రీనివాస్‌, టీపీఎస్‌, జగిత్యాల

‘ఇది జిల్లా కేంద్రంలోని జంబిగద్దె నుంచి మోతే వెళ్లే రోడ్డు. ఈ రోడ్డులో పలు ఆస్పత్రులు, వాణిజ్య సముదాయాల యాజమాన్యాలు రోడ్డును ఆనుకుని నేమ్‌ బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పార్కింగ్‌ సమస్య నెలకొంటోంది. ఆయా ఆస్పత్రులు, వాణిజ్యసముదాయాలకు వచ్చే వినియోగదారులు ఇష్టారీతిగా వాహనాలను పార్కింగ్‌ చేయడంతో ట్రాఫిక్‌ సమస్యతో ఇతర వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. ఇలా.. ఈ ఒక్క ఏరియాలోనే కాదు.. జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో ఆస్పత్రుల వద్ద, వాణిజ్య సముదాయాల ఎదుట రోడ్డును ఆక్రమించి నేమ్‌బోర్డులు, ఫ్లెక్సీల ఏర్పాటు చేయడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు’.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement