అటవీ భూముల ఆక్రమణ..!? | - | Sakshi
Sakshi News home page

అటవీ భూముల ఆక్రమణ..!?

Oct 15 2026 8:48 AM | Updated on Oct 15 2026 8:48 AM

మెట్‌పల్లి అటవీ రేంజ్‌లో 200 ఎకరాలు రూ.20కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతం కీలక అధికారి సూత్రధారి..? కింది స్థాయి అధికారులపైనే చర్యలు

కోరుట్ల: మెట్‌పల్లి ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలోని అటవీ భూములను కాపాడుకోవాల్సిన అధికా ర యంత్రాంగం కనుసన్నల్లోనే భూ ఆక్రమణ దందా సాగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ దందాలో దాదాపు రూ. 20 కోట్ల విలువైన 200 ఎకరాలు అన్యాక్రాంతమైందన్న ఫిర్యాదులు కలెక్టర్‌ అందడం గమనార్హం. ఈ దందాను ఓ సీనియర్‌ ఫారెస్టు అధికారి మూడేళ్లుగా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

మూడేళ్లుగా దందా

రెండున్నరేళ్ల క్రితం కథలాపూర్‌ మండలం ఇప్పపల్లి శివారులో 60 ఎకరాలు అన్యాక్రాంతమైందన్న ఆరోపణలు వచ్చాయి. పొరుగు గ్రామానికి చెందిన కొంత మంది సుమారు 60 ఎకరాల అటవీభూమి ఆక్రమణకు తెగబడటంతో స్థానికులు ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ ఎకరాకు రూ.50వేలు వసూలు చేసి ఆ భూములను ఇతరులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఆక్రమణలకు బాధ్యుడిని చేస్తూ రిటైర్డ్‌ అయిన ఓ పారెస్టు అధికారిపై ఉన్నతాధికారులు విచారణ జరిపారు. ఆ సమయంలో ఈ ఏరియాకు రేంజ్‌ ఆఫీసర్‌గా ఉన్న అధికారి సెలవుపై వెళ్లిపోవడం గమనార్హం. ఆ అధికారి పాత్ర ఎంత వరకు అనే విషయంలో స్పష్టత రాలేదు. తరువాతకాలంలో ఇప్పపల్లి సంఘటన క్రమేపీ తెరమరుగైంది. ఆ సమయంలో సెలవు పెట్టిన అధికారి ఈ మధ్య కాలంలో మళ్లీ మెట్‌పల్లి రేంజ్‌కు బదిలీపై వచ్చారు. అప్పటి నుంచి మళ్లీ పాత దందాకు తెరలేపినట్లు అనుమానాలు వస్తున్నాయి.

మళ్లీ అదే తంతు..

ఇప్పపల్లిలో వెలుగు చూసిన సంఘటన రీతిలోనే రెండు నెలలుగా మెట్‌పల్లి రేంజ్‌ పరిధిలోని రంగారావుపేట బీట్‌ అటవీ ప్రాంతంలోని ఆత్మకూర్‌, ఏఎస్‌ఆర్‌తండా, రంగారావుపేట శివారులో 600 ఎకరాల అటవీ భూమిలో 150 నుంచి 200 ఎకరాల్లో చెట్లు నరి కి చదును చేసే తంతు మొదలైంది. ఎకరానికి రూ.5 నుంచి రూ.8లక్షల మేర వసూలు చేసి అటవీ అధికారులే భూకబ్జా దందాను ప్రోత్సహిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ ఆక్రమణ దందాపై కొంతమంది కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మళ్లీ అటవీ శాఖ విజిలెన్స్‌ అధికారులు విచారణ జరిపి ఆ ప్రాంతంలోని బీట్‌ ఆఫీసర్‌ను సస్పెండ్‌ చేశారు.

సూత్రధారి ఎవరు..!?

అటవీ భూముల ఆక్రమణలు ఒకే సీనియర్‌ ఫారెస్ట్‌ అధికారి హయాంలో జరగడం విశేషం. త్వరలో రిటైర్డ్‌ కానున్న సదరు అధికారి సూత్రధారిగా రెండోసారి రంగారావుపేట బీట్‌ పరిధి లో అటవీ భూముల చదును, ఆక్రమణలు యథేచ్ఛగా కొనసాగినట్లు సమాచారం. ఈ భూముల విలువ రూ. 20కోట్ల వరకు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. మెట్‌పల్లి రేంజ్‌ పరిధిలో అటవీ భూములు అన్యాక్రాంతం అ యినట్లు ఆరోపణలు వచ్చిన సమయంలో కింది స్థాయి అధికారులపైనే చర్యలు తీసుకోవడం గమనార్హం. పైస్థాయిలో స్కాం సూత్రధారిగా వ్యవహరించిన అధికారిపై ఎలాంటి విచారణ జరగకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement