యాసంగిలో వరి సాగు వద్దు | - | Sakshi
Sakshi News home page

యాసంగిలో వరి సాగు వద్దు

Oct 15 2026 8:42 AM | Updated on Oct 15 2026 8:42 AM

జగిత్యాలఅగ్రికల్చర్‌: ఎల్‌నినో తీవ్ర రూపం దాల్చుతున్నందున యాసంగిలో వరి సాగు చేయొద్దని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు. జగిత్యాల రూరల్‌ మండలం పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో బుధవారం కిసాన్‌మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నందున వర్షాభావ పరిస్థితులు ఏర్పడబోతున్నాయని, ఈ క్రమంలో రైతులు వరి చేయొద్దని సూచించారు. వానాకాలం పంటలు రక్షించేందుకు ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ తక్కువ నీటితో పండే పంటల వైపు రైతులు దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అన్వేష్‌ రెడ్డి మాట్లాడుతూ.. కూరగాయలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు సాగు చేయాలని సూచించారు. జనుము, జీలుగ విత్తనాలను రైతులకు ఉచితంగా అందిస్తామని తెలిపారు. కలెక్టర్‌ సత్యప్రసాద్‌ మాట్లాడుతూ తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేయాలని కోరారు. కరెంట్‌ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదని, రైతులు ఇబ్బంది పడుతున్నారని వ్యవసాయ వర్సిటీ సలహా మండలి మాజీ సభ్యుడు వెల్ముల రాంరెడ్డి సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ప్రత్యామ్నయ సాగు పంటల బ్రోచర్‌, పుస్తకాలను ఆవిష్కరించారు. మహిళా రైతు దినోత్సవం సందర్భంగా ఉత్తమ మహిళా రైతులను సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లు రైతులను ఆకట్టుకున్నాయి. వ్యవసాయ విద్యార్థులతో మంత్రి మాట్లాడి వారి సమస్యలు తెలసుకున్నారు. పరిశోధన స్థానం డైరెక్టర్‌ వెంకట్‌ రెడ్డి, వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ సురేష్‌, డీఏవో భాస్కర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నారాయణ రెడ్డి, ఆత్మ చైర్మన్‌ కాటిపెల్లి గంగారెడ్డి, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నందయ్య పాల్గొన్నారు.

అబ్బురపరిచిన పుంగనూరు ఆవు

పొలాసకు చెందిన లక్ష్మణ్‌ అనే రైతు పెంచుతున్న పుంగనూరు ఆవు రైతులను అబ్బురపర్చింది. ఆవు పొట్టిగా ఉండి రోజుకు నాలుగైదు లీటర్లు పాలు ఇస్తుందని, పాలలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

వ్యవసాయ విద్యార్థుల ప్రదర్శనలు

పొలాస వ్యవసాయ కళాశాల విద్యార్థుల బృందం తయారు చేసిన పుట్టగొడుగులు, వివిధ రకాల కూరగాయలు, చెట్నీలు ప్రదర్శనగా పెట్టారు. చాలామంది వాటిని కొనుగోలు చేశారు. ఉత్పత్తులను పొలాస బ్రాండ్‌తో.. మార్కెట్‌ రేటు కంటే తక్కువకు విక్రయించడంతో రైతులు కొనుగోలుకు ఆసక్తి చూపారు.

ఆధునాతన పరికరాలు

కిసాన్‌ మేళాలో పెట్టిన ఆధునిక పరికరాలు రైతులను ఆకట్టుకున్నాయి. ట్రాక్టర్‌కు బిగించి ఉపయోగించే చాలా పరికరాలను ప్రదర్శనగా పెట్టారు. గడ్డిని చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసే మల్చర్‌ యంత్రం, మక్కలు ఒలిచే యంత్రం, విత్తనాలు వేసే యంత్రాలు, వరి నాటు వేసే యంత్రాలను ప్రదర్శనగా పెట్టారు. ధరలు ఎక్కువగా ఉండటంతో రైతులు పరికరాల వివరాలు తెలుసుకోవడానికే పరిమితమయ్యారు.

పొలాస కిసాన్‌మేళాలో వక్తల అభిప్రాయం

పాల్గొన్న మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే సంజయ్‌, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అన్వేశ్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement