50 ఏళ్ల మజిలీ | - | Sakshi
Sakshi News home page

50 ఏళ్ల మజిలీ

Oct 3 2026 12:26 AM | Updated on Oct 3 2026 12:26 AM

1976లో ప్రారంభం ఎన్నో ప్రశంసలు

1976లో ఏపీ సూపర్‌ఫాస్ట్‌గా ప్రస్థానం మొదలు 2015లో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం ఉత్తర తెలంగాణ ప్రజలు ఢిల్లీకి వెళ్లేందుకు అనువైన రైలు పెద్దపల్లిలో హాల్టింగ్‌ ఇస్తే ఉమ్మడి జిల్లావాసులకు సౌకర్యం

కొత్త రాష్ట్రంలో మారిన పేరు

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌.. ఉమ్మడి జిల్లా నుంచి ఉదయాన్నే ఢిల్లీ ప్రయాణం చేసేందుకు ఏకై క ప్రయాణ సాధనం. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ఎక్స్‌ప్రెస్‌గా ప్రస్థానం మొదలుపెట్టి.. తొమ్మిదేళ్ల క్రితం తెలంగాణ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌గా రూపాంతరం చెందిన ఈ రైలుకు అక్టోబరు 3తో 50 ఏళ్లు పూర్తయ్యాయి. 50 ఏళ్ల మజిలీలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ రూపం, నామంలో, హాల్టింగ్‌లో వచ్చిన మార్పులు, ప్రయాణ వివరాలు పరిశీలిస్తే..

1976 అక్టోబర్‌ 3వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌గా తన ప్రయాణాన్ని సికింద్రాబాద్‌ నుంచి న్యూఢిల్లీకి ప్రారంభించింది. తెలంగాణ (పూర్వ ఆంధ్ర ప్రదేశ్‌) సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జలగం వెంగళ్‌రావు, నాటి రైల్వే మంత్రి మధు దండవతే కలిసి సికింద్రాబాద్‌లో ప్రారంభించారు. అప్పటి వరకు హైదరాబాదు నుంచి దేశ రాజధాని ఢిల్లీకి దక్షిణ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు మాత్రమే సేవలు అందించేది. ఆరంభంలో ఈ రైలు 123/124 సంఖ్యలతో పిలిచేవారు. తొలుత స్టీమ్‌ ఇంజిన్‌, ఆ తరువాత డీజిల్‌ ఇంజిన్‌, ప్రస్తుతం విద్యుత్తు ఇంజిన్‌ వరకు తన ప్రయాణంలో మూడుసార్లు తన స్వరూపాన్ని మార్చుకుంది. తొలుత ఐసీఎఫ్‌ బోగీలతో 2019 వరకు నడిచింది. జర్మన్‌ సాంకేతికతతో వచ్చిన ఎల్‌హెచ్‌బీ బోగీలతో 2019 నుంచి తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఈ రైలు సంఖ్య 2011 వరకు 2723/24 ఉండేది, ఆ తరువాత 12723/24 గా మార్చారు. రైలు ప్రారంభించిన కొత్తలో కాజీపేట జంక్షన్‌లో మాత్రమే హాల్టింగ్‌ సదుపాయం ఉండేది. తరువాత సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లిలో హాల్టింగ్‌ కల్పించారు.

1960 వరకు దక్షిణాది మొత్తానికి ఢిల్లీ వెళ్లేందుకు గ్రాండ్‌ ట్రంక్‌(జీటీ) మాత్రమే దిక్కు. 1965లో దక్షిణ్‌ అందుబాటులోకి వచ్చింది. దశాబ్దకాలం తరువాత తెలంగాణ (ఆంధ్ర ప్రదేశ్‌) సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలును ప్రవేశ పెట్టారు. ఈ రైలును ఉమ్మడి దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో దక్షిణ మధ్య రైల్వే జోన్‌ రారాజుగా అభివర్ణించారు. ఎందుకంటే దాని సమయపాలన, శుభ్రత అన్ని పరిగణనలోకి తీసుకొని ఇలా ప్రశంసిస్తారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 2015లో విశాఖపట్నం– న్యూఢిల్లీ మధ్య 20805/06 ఏపీ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభించారు.

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఏర్పడిన తరువాత ఈ రైలుకు ఆంధ్రప్రదేశ్‌ బదులుగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేయాలనే డిమాండ్‌ వచ్చింది. 2015 నవంబర్‌ 15వ తేదీన ఈ రైలు పేరును ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. ఈ రైలు తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల గుండా ఢిల్లీకి చేరుకుంటుంది. ఈ రైలుకు తెలంగాణలోని ముఖ్య జిల్లాకేంద్రాల్లో, జంక్షన్లలో హాల్టింగ్‌ సదుపాయం కల్పించాలని ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం ప్రతినిధులు పోరాటం చేస్తున్నారు. పెద్దపల్లి జంక్షన్‌లో హాల్టింగ్‌ కల్పిస్తే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్లతో పాటు నిజామాబాద్‌, సిద్దిపేట జిల్లాల ప్రయాణికులకు ఢిల్లీ నుంచి రావడానికి, వెళ్లడానికి సౌకర్యంగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement