జిల్లాలో 3.65 మీటర్ల లోతులో భూగర్భ జలాలు అగస్టుతో పోల్చితే సెప్టెంబర్‌లో కొంత ఆశాజనకం కొడిమ్యాల మండలంలో 10.23 మీటర్లకు పడిపోయిన నీరు
జగిత్యాల అగ్రికల్చర్: జిల్లాలో వానాకాలం సీజన్ ముగుస్తున్నా.. భూగర్భ జలాలు ఇంకా లోతుల్లోనే ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు నిరాశ పరచగా, భూగర్భ జలాలు పెద్దగా పెరిగిన దాఖలాలు లేవు. అడపాదపడపా కురిసిన వర్షాలతో, జిల్లాలో అగస్టుతో పోల్చితే సెప్టెంబర్ నెల చివరి నాటికి భూగర్భజలాలు 0.82 మీటర్ల మేర పెరగడం సాగుకు కొంత ఆశాజనకంగా మారింది. గతేడాది సెప్టెంబర్‌తో పోల్చితే 1.32 మీటర్ల నీటిమట్టం పడిపోవడం ఆందోళనకరమైన అంశంగా చెప్పవచ్చు.
కోరుట్లలో 8.22 మీటర్ల లోతుల్లో
జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీలు ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో నీటిమట్టం పడిపోతోంది. ఇష్టానుసారంగా బోరు బావులు తవ్వుతుండడంతో పాటు నీటిని అధికంగా వినియోగిస్తుండటంతో భూగర్బజలాలు లోతుకు పడిపోతున్నాయి. సెప్టెంబర్‌లో జగిత్యాల జిల్లాకేంద్రంలో 7.82 మీటర్లకు, కోరుట్లలో 8.22 మీటర్లకు, మెట్‌పల్లిలో 4.04, రాయికల్‌లో 2.66, ధర్మపురి మున్సిపాలిటీలో 3.08 మీటర్లకు భూగర్భ జలం పడిపోయింది. మల్యాల, మేడిపల్లి, కథలా పూర్, కొడిమ్యాల, భీమారం మండలాల్లో మరింతగా పడిపోతున్నాయి. మల్యాల మండలంలో 7.60 మీటర్లకు, కొడిమ్యాలలో 10.23 మీటర్లు, కథలాపూర్ మండలంలో 2.18 మీటర్లకు, మేడిపల్లి మండలంలో 4.04 మీటర్లు, భీమారం మండలంలో 2.55 మీటర్లకు నీటి మట్టం పడిపోయింది.
ఒక్క నెలలో పెరిగిన భూగర్భ జలం
జిల్లాలో అడపా, దడపా కురిసిన వర్షాలతో ఒక్క నెలలోనే నీటిమట్టం సగటున 0.82 మీటర్లకు పెరిగింది. అగస్టు నెలలో 4.47 మీటర్ల లోతులో నీరు ఉండగా, సెప్టెంబర్ నెల చివరి నాటికి 0.82 మీటర్లు పెరిగి, ప్రస్తుతం 3.65 మీటర్లకు చేరుకుంది. గతేడాది సెప్టెంబర్‌తో పోల్చితే 1.32 మీటర్లు తగ్గింది. సెప్టెంబర్ చివరి నాటికి బీర్‌పూర్ మండలంలో అతి తక్కువ లోతు 2.01 మీటర్ల లోతులో నీరు ఉండగా, అత్యధికంగా 10.23 మీటర్ల లోతులో కొడిమ్యాలలో నీరు ఉండటం గమనార్హం.
ఆయకట్టు మండలాల్లోనూ అంతంతే
జిల్లాలోని ఆయకట్టు మండలాల్లోనూ నీటిమట్టం పడిపోతూనే ఉంది. బుగ్గారం మండలంలో 2.64 మీటర్లు, ఎండపల్లి మండలంలో 5.15 మీటర్లు, గొల్లపల్లి మండలంలో 2.12 మీటర్లు, జగిత్యాల రూరల్ మండలంలో 2.05, పెగడపల్లి మండలంలో 2.03, సారంగాపూర్ మండలంలో 3.05, వెల్గటూర్ మండలంలో 2.58, ఇబ్రహీంపట్నంలో 3.56, మల్లాపూర్ మండలంలో 3.77 మీటర్లకు భూగర్భజల మట్టం పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వర్షాకాలం సీజన్ పూర్తి కావడంతో, ఆక్టోబర్ నెలలోనూ భూగర్భ జలమట్టం మరింత లోతుకు పడిపోయే అవకాశం ఉంది. కొంత నీటి మట్టం పెరగడం కాస్త ఊరటనిస్తోంది.


