వచ్చే ఏడాది గోదావరి మహా పుష్కరాలు భక్తుల కోసం కొనసాగుతున్న ఏర్పాట్లు 2.40 కోట్ల మంది వస్తారని అంచనా రూ.220.41 కోట్ల నిధులు మంజూరు రూ.20కోట్లతో ధర్మపురి, కోటిలింగాల ఆలయాల పునరుద్ధరణ
కోటిలింగాల ఆలయ పునరుద్ధరణ పనులు
ధర్మపురి పుష్కరఘాట్
జగిత్యాల: వచ్చే ఏడాది నిర్వహించే గోదావరి మహా పుష్కరాలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. పుష్కరాల ఏర్పాట్లకు ప్రభుత్వం జిల్లాకు రూ.220.41 కోట్లు మంజూరు చేసింది. సుమారు 2.40 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనాలు వేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 39ఘాట్లను అభివృద్ధి చేయనున్నారు. ధర్మపురిలో 5, ధర్మపురి మండలంలోని ఇతర గ్రామాల్లో 9, వెల్గటూర్‌లో 4, ఇబ్రహీంపట్నంలో 8, మల్లాపూర్‌లో 6, బీర్‌పూర్‌లో 6, రాయికల్‌లో 1 ఘాట్ అభివృద్ధి చేయనున్నారు. ధర్మపురిలోని హనుమాన్ గడ్డ వీఐపీ గడ్డ, మంగళిఘాట్, కోటిలింగాల ఘాట్‌లకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు.
2015కు మించి భక్తులు వచ్చే అవకాశం
2015లో జరిగిన గోదావరి పుష్కరాల్లో సుమారు 1.5 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. 2027లో పుష్కరాలకు దాదాపు 2.40 కోట్ల మంది వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా రహదారులు, ఘాట్లు, తాగునీరు, పారిశుధ్యం, వైద్య సదుపాయాలు, పార్కింగ్ తదితర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఘాట్ల వద్ద పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నారు.
ఆలయ పునరుద్ధరణ
పుష్కరాల నేపథ్యంలో ధర్మపురి ఉగ్రనృసింహస్వామి ఆలయ పునరుద్ధరణకు రూ.10 కోట్లు, కోటిలింగాల ఆలయ పునరుద్ధరణకు రూ.10 కోట్లు మంజూరు కాగా, పనులు ప్రారంభమయ్యాయి. కోటిలింగాల ఆలయ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి.


