గాంధీ జయంతి వేళ భీమ్‌రాజ్‌పల్లి పంచాయతీ తీర్మానం శుభకార్యాల్లో ప్లాస్టిక్ వాడితే రూ.5,000 జరిమానా నేటి నుంచే పకడ్బందీగా అమలు
గొల్లపల్లి: పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక రుగ్మతల నిర్మూలనలో ఆదర్శంగా నిలుస్తోంది జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని భీమ్‌రాజ్‌పల్లి గ్రామం. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని గ్రామంలో ప్లాస్టిక్ మహమ్మారిని సమూలంగా తరిమికొట్టడంతో పాటు బాల్య వివాహాల ను అరికట్టేందుకు పంచాయతీ పాలకవర్గం నడుం బిగించింది. సర్పంచ్ కొలగాని శ్రీలత గంగాచారి అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన పాలకవర్గం.. భీమ్‌రాజ్‌పల్లిని నూరుశాతం ‘ప్లాస్టిక్ రహిత, బాల్య వివాహ నిషేధిత గ్రామంగా’ తీర్చిదిద్దేందుకు ఏకగ్రీవ తీర్మానాలు ఆమోదించి, గ్రామ పెద్దలతో కలిసి సామూహిక ప్రతిజ్ఞ చేసింది.
ప్లాస్టిక్ వాడితే రూ. 5,000 కఠిన జరిమానా
గ్రామంలో నిర్వహించే వివాహాది శుభకార్యాలు, ఇతర వేడుకల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు వాడకూడదని పంచాయతీ స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయంగా ప్రకృతి సిద్ధమైన అరిటాకులు, మోదు గ విస్తరాకులు, స్టీల్ పాత్రలను వినియోగించాలని సూచించింది. నిబంధనలను ఉల్లంఘించి ప్లాస్టిక్ ఉపయోగిస్తే రూ.5,000 జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది. ఈ నిర్ణయం శనివారం నుంచే తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
బాల్య వివాహాల నిర్మూలనకు సంకల్పం
ఆడబిడ్డల భవిష్యత్తును కాపాడటమే ధ్యేయంగా బాల్య వివాహాల నిర్మూలనకు పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. గ్రామంలో ఎక్కడా బాల్య వివా హాలు జరగకుండా చూడాలని, ఆడపిల్లలను చది వించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని పాలకవర్గం పిలుపునిచ్చింది. బాల్య వివాహా లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హె చ్చరిస్తూ ప్రతిజ్ఞ చేశారు. రిటైర్డ్ జేసీ కందుకూరి కృష్ణారెడ్డి, మండల లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ బొమ్మన కుమార్, పంచాయతీ కార్యదర్శి శైలజ, ఉపసర్పంచ్ బొమ్మెన రాజమ్మ, వార్డు సభ్యులు రేవెల్లె కుమార్, సాగర్, గంగవ్వ, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.


