ధాన్యం నిల్వ చేసేది ఎలా? | - | Sakshi
Sakshi News home page

ధాన్యం నిల్వ చేసేది ఎలా?

Aug 28 2026 11:47 PM | Updated on Aug 28 2026 11:47 PM

జిల్లాలో 2.75 లక్షల ఎకరాల్లో వరిసాగు మరో నెల రోజుల్లో ధాన్యం వచ్చే అవకాశం ఫంక్షన్‌ హాళ్లు, ఖాళీ గిడ్డంగులపై అధికారుల దృష్టి

జగిత్యాలఅగ్రికల్చర్‌: ప్రస్తుత వానాకాలం సీజన్‌లో పండిన వరి ధాన్యాన్ని నిల్వ చేసేందుకు సరిపడా నిల్వల ప్రదేశాలు లేకపోవడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో సివిల్‌ సప్లయ్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో ధాన్యం నిల్వపై ప్రధాన చర్చ జరిగింది. ఆమేరకు జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం నిల్వలకు ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను అదేశించారు. దీంతో ఫంక్షన్‌ హాళ్లు, ఖాళీ గిడ్డంగులపై దృష్టి సారించారు.

జిల్లాలో 2.75 లక్షల ఎకరాల్లో వరి సాగు

ఎల్‌నినో అంటూ అధికారులు భయపెట్టినప్పటికీ జిల్లాలో రైతులు దాదాపు 2.75 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. దాదాపు 5–6 లక్షల మె.ట వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్పత్తి అయిన ధాన్యాన్ని, ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేసి, సీఎంఆర్‌ బియ్యం కోసం రైస్‌మిల్లులకు కేటాయిస్తారు. ప్రస్తుతం జిల్లాలోని దాదాపు 130 మంది రైస్‌మిల్లర్ల వద్ద 3–4 లక్షల మె.ట ధాన్యం నిల్వలతో పాటు బియ్యం నిల్వలు పేరుకపోయాయి. దీంతో ఎక్కడా గోదాంలు ఖాళీ లేవు. గడిచిన యాసంగి ధాన్యాన్ని పక్క జిల్లా సిరిసిల్ల అపెరల్‌ పార్క్‌ గోదాంలకు పంపించారు. దీనికి తోడు మార్కెట్‌యార్డు ఖాళీ ప్రదేశాల్లో, మిల్లుల వద్ద టార్పాలిన్లు వేసి నిల్వలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే, మిల్లుల కెపాసిటీ మేరకు ధాన్యం తీసుకుంటామని, అధిక ధాన్యం కేటాయించడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని మిల్లర్లు ఆవేదన చెందుతున్నారు. మిల్లర్ల వద్ద నుంచి ఎఫ్‌సీఐ బియ్యాన్ని తీసుకోవడంలో కూడా జాప్యం చేస్తుండటంతో బియ్యం నిల్వలు సైతం మిల్లుల్లో పేరుకపోతున్నాయి. మరో నెల రోజుల్లో వానాకాలం ధాన్యం రానుండటంతో, ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

ఎక్కడ ఖాళీ షెడ్లు ఉన్నా తీసుకోవాల్సిందే

జిల్లాతో పాటు చుట్టు ప్రక్కల ఎక్కడ ఖాళీ షెడ్లు ఉన్న తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన అదేశాలు జారీ చేశారు. కొత్త ధాన్యం వచ్చే సమయానికి ప్రభుత్వ గోదాంలతో పాటు ప్రైవేట్‌ గోదాంలు, మార్కెట్‌ యార్డులోని షెడ్లు, ఖాళీగా ఉన్న పారిశ్రామిక షెడ్లు, ఫంక్షక్షన్‌ హాళ్లు, ఓపెన్‌ షెడ్లు స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే గోదాంల్లో నిల్వ ఉన్న పాత నిల్వలను వెంటనే ఖాళీ చేయించాలని, ఇటివలే మక్కల కొనుగోలుకు టెండర్లు అయినందున గోదాంల్లో నిల్వ చేసిన మక్కలను ఖాళీ చేయించి అత్యధిక నిల్వ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకరావాలని సూచించారు.

ధాన్యం టెండర్లకు రంగం సిద్ధం

యాసంగి సీజన్‌లో ఎఫ్‌సీఐ కోటాకు మించి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లులు, ఇతర గోదాంల్లో నిల్వ చేసింది. దీంతో రాబోయే సీజన్‌కు నిల్వ పరిస్థితి ఇబ్బంది కరంగా ఉండటంతో ప్రభుత్వం కోటాను మించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని టెండర్లు పిలిచి విక్రయించాలని నిర్ణయించింది. టెండరుదారులు నెల రోజులలోపు ధాన్యాన్ని తరలించాలని కూడా అదేశాలు ఇవ్వనుంది. దీంతో, కొంత మేర జిల్లాలో నిల్వ సామర్థ్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement