రీసర్వేను పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

రీసర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

Aug 28 2026 11:47 PM | Updated on Aug 28 2026 11:47 PM

జగిత్యాల: భూముల రీసర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో తహసీల్దార్లు, గిర్దవార్లు, జీపీవోలతో రీసర్వేపై నిర్వహించిన సమగ్ర శిక్ష కార్యక్రమంలో మాట్లాడారు. రీసర్వే ద్వారా గ్రామాల్లోని ప్రతీ భూకమతాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఖచ్చితంగా కొలిచి భూ రికార్డులను నవీకరించడం జరుగుతుందన్నారు. భూ యజమానుల హక్కుల పరిరక్షణతో పాటు, భవిష్యత్‌లో భూ వివాదాలను నివారించడమే రీసర్వే ప్రధాన లక్ష్యమని తెలిపారు. సర్వే గురించి గ్రామస్థాయిలో భూ యజమానులు, పట్టాదారులు, రైతులు ప్రజాప్రతినిధులు సర్వే కార్యక్రమంపై అవగాహన కల్పించాలన్నారు. అలాగే గ్రామాల్లోని ప్రభుత్వ భూములు, అటవీభూములు, చెరువులు, కుంటలు, వాగులు, రహదారులు, శ్మశాన వాటికలు అన్నింటినీ గుర్తించి, సర్వే చేసేటప్పుడు రెవెన్యూ రికార్డులు, పాత గ్రామ పటాలు, సేత్వార్‌, టీపాన్‌, ఖస్ర పహానీ, వాస్తవ పరిస్థితులను పరిశీలించాలన్నారు. కొలతలు పూర్తయిన అనంతరం భూ యజమానులకు నోటీసులు జారీ చేసి వారి సమక్షంలో హద్దులు నిర్ధారించాలని సూచించారు. అభ్యంతరాలు, క్లెయిమ్‌లు వచ్చినప్పుడు స్వీకరించి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరించాలన్నారు. రీసర్వే అనేది కేవలం భూములను కొలిచే కార్యక్రమమే కాదని, గ్రామంలోని అంగుళం భూమికి సంబంధించిన సమగ్రమైన శాశ్వతమైన రికార్డులను రూపొందించే కీలక కార్యక్రమం అని వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ బీఎస్‌.లత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement