● అదనపు కలెక్టర్ బీఎస్.లత
జగిత్యాలరూరల్: రీ సర్వేను పకడ్బందీగా.. వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ బీఎస్.లత అన్నారు. బీర్‌పూర్ మండలం మోతీనగర్‌లో నాన్ కెడస్ట్రాల్ రీసర్వే, ఎంజాయ్‌మెంట్ రీ సర్వే పనులను శనివారం పరిశీలించారు. గ్రామంలో ఎంత విస్తీర్ణంలో రీ సర్వే పూర్తయింది..? ఇంకా ఎంత మేర చేపట్టాల్సి ఉంది..? ఎన్ని రోజుల్లో పూర్తవుతుందనే వివరాలను రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సర్వే నంబర్ల వారీగా ఎలాంటి పొరపాట్లు లేకుండా కచ్చితత్వంతో రీ సర్వే చేయాలన్నారు. సర్వే పూర్తయిన అనంతరం భూ వివరాలను ప్రజలకు ప్రకటిస్తామని పేర్కొన్నారు. గ్రామ బౌండరీపై లైసెన్స్‌డ్ సర్వేయర్లు, మండల సర్వేయర్లు కలిసి రీ సర్వే చేస్తారని, తర్వాత ఒక్కో రైతు వారీగా రీసర్వే ఉంటుందని తెలిపారు. జిల్లాలో మొదటి విడతగా 70 గ్రామాల్లో రీ సర్వే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. ప్రస్తుతం ఎంజాయ్మెంట్ రీసర్వే కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సుజాత, సర్వేయర్‌లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు
మల్యాల: కాంగ్రెస్ పాలనలో ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మండలంలోని ఒబులాపూర్‌లో రజక సంఘం భవనం, అంబేద్కర్ యువజన సంఘ భవనాలకు కాంగ్రెస్ నాయకులు, స్థానికులతో భూమిపూజ చేశారు. జెడ్పీ పాఠశాలలో కిచెన్ షెడ్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. సర్పంచ్ గ్యాదం కుమార్, ఎంపీడీవో స్వాతి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంఈవో నీలగిరి జయసింహారావు, ఉప సర్పంచ్ మల్లేశం, నర్సింహారెడ్డి, తిరుపతి, బత్తిని శ్రీనివాస్‌గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్, మ్యాక లక్ష్మణ్, మండల అధ్యక్షుడు శనిగరపు తిరుపతి సర్పంచులు పాల్గొన్నారు.
గొర్రెల కాపరులకు అండగా ఉంటాం
కొడిమ్యాల: మండలంలోని కోనాపూర్‌లో గత నెల వీధి కుక్కల దాడిలో 20 గొర్రెలు మృతి చెందిన విషయం తెల్సిందే. గొర్రెలకాపరులు మీరుపాల పర్వాతలుకు రూ.30వేలు, ఓల్లం ఎల్లయ్యకు రూ.15వేల చెక్కును ఎమ్మెల్యే అందించారు. కాపరులకు భవిష్యత్‌లో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సర్పంచ్ తిరుపతి, వెటర్నరీ జిల్లా అధికారి ప్రకాశ్, సర్పంచుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డం జీవన్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కడారి మల్లేశం, ప్యాక్స్ చైర్మన్ రాజానర్సింగరావు పాల్గొన్నారు.
ఆరు డీఏలు విడుదల చేయాలి
జగిత్యాల: పీఆర్సీ ప్రకటించి.. ఆరు డీఏలు విడుదల చేయాలని టీపీయూఎస్ జిల్లా అధ్యక్షుడు బోయినిపల్లి ప్రసాద్‌రావు అన్నారు. పలు పాఠశాలల్లో సభ్యత్వ నమోదు చేపట్టారు. పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని, ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని కోరారు.


