సిరిసిల్లటౌన్/ముస్తాబాద్(సిరిసిల్ల): కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల ఎత్తిపోతలపై రాష్ట్ర సర్కారు భేషజాలకు పోవద్డని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.జీవన్‌రెడ్డి సూచించారు. సిరిసిల్లలోని పార్టీ కార్యాలయంలో శనివారం మాట్లాడారు. గోదవారి జలాలు ఎత్తిపోస్తే మాజీ సీఎం కేసీఆర్‌కు ఎక్కడ పేరొస్తుందోనని లేనిపోని భేషజాలకు పోతున్నారన్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకోవాలంటే కన్నెపల్లి పంపుహౌస్ వద్ద నీటిని ఎలా వినియోగంలోకి తీసుకురావాలో ఆలోచించాలన్నారు. సీఎం మనవడి కోసం ఫుట్‌బాల్ మ్యాచ్‌కు రూ.100 కోట్లు వెచ్చించారని అవే నిధులతో కన్నెపల్లి వద్ద కాపర్ డ్యాం నిర్మితమైతుందన్నారు. రాజాబహుదూర్ వెంకటరా మారెడ్డి కోత్వాల్‌గా పనిచేసి విద్య, వైద్యం అందరికీ అందేలా చూశారని, ఆయన సేవలు ప్రశంసనీయమని జీవన్‌రెడ్డి కొనియాడారు. అనంతరం ముస్తాబాద్‌లో రాజాబహుదూర్ వెంకటరామారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
రేవంత్‌కు సీఎంగా కొనసాగే అర్హత లేదు
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదలకు అందించకుండా నిర్వీర్యం చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఆఫీస్‌లో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. ఇరవై నాలుగు గంటల కరెంట్, రైతుబంధు, రైతుబీమా ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయన్నారు. మళ్లీ కేసీఆర్ ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తేనే అన్ని పథకాలు అమలు అవుతాయన్నా రు. సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సురేందర్‌రావు, పట్టణాధ్యక్షుడు నర్సింహారెడ్డి, చెవుల మల్లేశ్ పాల్గొన్నారు.


