జగిత్యాల: కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే క్షమాపణలు చెప్పాలని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారానికి సీడబ్ల్యూపీఆర్‌ఎస్ నివేదిక చెంప పెట్టు అన్నారు. మేడిగడ్డలో ఒక బ్లాక్‌లో రెండు పిల్లర్స్‌కు మాత్రమే సమస్య ఉన్నట్లు పరిశీలనలో తేలిందని, కానీ.. ఇన్నాళ్లు కాళేశ్వరం మొత్తం కూలిందని ప్రచారం చేశారని విమర్శించారు. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ ఒకటే కాదని, తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్ల వరకు ఉన్న నీటి ఎత్తిపోతల వ్యవస్థను చూడాలన్నారు. శనివారం బీఆర్‌ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి గుంపుమేసీ్త్ర కాదని, తెలంగాణ ముంపుమేసీ్త్ర అని విమర్శించారు. ఎల్‌నినో ప్రభావంతో ఈసారి లోటు వర్షపాతం ఉంటుందని నిపుణులు హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. జూలైలో మహారాష్ట్ర, కర్నాటకలో కురిసిన భారీ వర్షాలకు గోదావరి, కృష్ణ నదులకు వరదలు వచ్చాయని, ఆ సమయంలో నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లు నింపుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. కాళేశ్వరం నీటిని ఎత్తిపోస్తే మిడ్‌మానేరు, ఎల్‌ఎండీ, అన్నపూర్ణ, రంగనాయక్‌సాగర్, మల్లన్నసాగర్ వంటి రిజర్వాయర్లు నింపుకునే అవకాశం ఉండేదన్నారు. కాళేశ్వరంపై రాజకీయ కక్షతో తెలంగాణకు వచ్చిన నీటిని సద్వినియోగం చేసుకోలేదని ఆరోపించారు. నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ విజయలక్ష్మీ, శివకేసరి బాబు, రాజేశ్, వెంకటేశ్వర్‌రావు, ఆనందరావు, శీలం ప్రవీణ్, రాజేందర్ పాల్గొన్నారు.


