జగిత్యాలరూరల్: మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న సర్కారు.. మహిళా సంఘాలకు సొంత భవనాలు ఉండేలా చూస్తోంది. స్వయం సహాయక బృందాలకు శాశ్వత వేదికలు ఉండేలా చేపట్టిన భవన నిర్మాణాలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. వీటిని ప్రతి గ్రామంలో పొదుపు సంఘాలు, ఉపాధి హామీ (వీబీజీరాంజీ) కింద జిల్లాకు మంజూరు చేసింది. భవనాలను ఈ ఏడాది నవంబరు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు సంయుక్తంగా పనిచేస్తున్నాయి. డిసెంబర్ నాటికి కొత్త భవనాల్లోకి వెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం జిల్లాకు మొత్తం 320 వీవో భవనాలను ఈ ఏడాది జనవరిలో మంజూరు చేసింది. ఒక్కో భవనానికి రూ.10 లక్షల నిధులు కేటాయించారు. కొన్ని గ్రామాల్లో స్థలాలు అందుబాటులో ఉండడంతో స్థానిక సర్పంచ్‌లు, సంబంధిత అధికారులు కలిసి పనులు ప్రారంభించారు. వీటి నిర్మాణ బాధ్యతలు పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ శాఖకు అప్పగించారు. ఇప్పటికే జిల్లాలో మూడు భవనాలు పూర్తయి అందుబాటులోకి వచ్చాయి. ఇంకా 220 భవనాల పనులు పురోగతిలో ఉన్నాయి.
ఆర్థిక స్వావలంభన కోసం
జిల్లాలోని 20 మండలాలు, 385 పంచాయతీలు ఉన్నాయి. 1,79,862 మంది సభ్యులతో 18 మండల సంఘాలు, 565 గ్రామసంఘాలు కొనసాగుతున్నాయి. మహిళా సంఘాలకు విద్యార్థుల దుస్తులు కుట్టే పనితోపాటు పలు పథకాల కింద స్వయం ఉపాధి కల్పిస్తోంది. ఈ విధానంలో కొన్ని సమస్యలు తలెత్తడంతో సెర్ప్ దృష్టికి తీసుకెళ్లారు. మహిళలకు దుస్తులు కుట్టడంతోపాటు పలు మార్గాల్లో ఉపాధి అందించేలా ప్రత్యేక భవనాలు నిర్మించేందుకు సంస్థ ప్రతిపాదించగా అందుకు ప్రభుత్వం ఆమోదించింది. 569 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్లాబ్‌తో వర్క్‌షెడ్ నిర్మించారు. ఇందులో 500 చదరపు అడుగుల హాల్ ఉంటుంది. రెండు ద్వారాలు, తలుపులు, 6 కిటికీలు, ఆరు సీలింగ్ ఫ్యాన్లు, 8 ట్యూబ్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. టాయ్‌లెట్, బాత్‌రూం నిర్మిస్తున్నారు.
మండలాలు 20
గ్రామ పంచాయతీలు 385
మహిళా సంఘ సభ్యులు 1,79,862
మండల సంఘాలు 18
గ్రామ సంఘాలు 565
జిల్లాకు మంజూరైన భవనాలు 320
అందుబాటులోకి వచ్చినవి 03
పురోగతిలో ఉన్నవి 220
త్వరగా పూర్తి చేయిస్తాం
గ్రామ మహిళా సంఘాల భవనాలు త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో పంచాయతీరాజ్ అధికారులతో కలిసి పనిచేస్తున్నాం. ఇప్పటికే మూడు భవనాలు పూర్తయ్యాయి. మరో 220 భవనాలు పురోగతిలో ఉన్నాయి. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ నివేదికలు తెప్పిస్తున్నాం.
– రఘువరణ్, డీఆర్డీఏ పీడీ


