నాణ్యత లేక..
ఎఫ్‌సీఐ మిల్లర్ల వద్ద నుంచి సేకరించే ధాన్యం జిల్లాలో గొల్లపల్లి మండలం ఇస్రాజ్‌పల్లి, బుగ్గారం మండలం యశ్వంతరావుపేట, కొడిమ్యాల మండలం నాచుపల్లి, మల్యాల మండలం బల్వంతాపూర్‌లోని గోదాములుకు చేరుతాయి. ఈ గోదాముల నిర్వాహకులు కొంతకాలంగా నిబంధనలు పాటించకపోవడంతో పాటు నాణ్యత ప్రమాణాలు, తూకంలో వ్యత్యాసం లాంటి కారణాలతో బియ్యం గోదాముల్లో దింపుకునేందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో మిల్లర్లు కూడా తామేం తక్కువ కాదంటూ గోదాం నిర్వాహకులకు భయపడేది లేదంటూ బియ్యం కూడా నాణ్యతగానే సరఫరా చేస్తున్నామంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో ఎఫ్‌సీఐ అధికారులు కూడా బియ్యం సేకరణ సక్రమంగా చేయాలని నిర్వాహకులకు సూచిస్తున్నా వారు కూడా వారి ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు.
తూకంలో వ్యత్యాసాలు
జిల్లాలో ప్రభుత్వం ఐకేపీల వద్ద కొనుగోలు చేసిన వరిధాన్యాన్ని రైస్‌మిల్లర్లకు అప్పగించగా రైస్‌మిల్లర్లు వరిధాన్యాన్ని బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐ గోదాములకు తరలిస్తున్నారు. గోదాంలకు తరలిస్తున్న సమయంలో రైస్‌మిల్లర్లు వేబ్రిడ్జిల వద్ద తూకం వేసి పంపిస్తున్నారు. కానీ గోదాంల వద్దకు వెళ్లేసరికి ఒక్కో లారీకి 70 నుంచి క్వింటాల్ వరకు వ్యత్యాసం వస్తుండటంతో బియ్యం తీసుకునేందుకు గోదాంల నిర్వాహకులు నిరాకరిస్తున్నారు. దీంతో తాము తూకం వేసి పంపించిన లారీల్లో ఎలా వ్యత్యాసాలు వస్తాయంటూ మిల్లర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జగిత్యాలరూరల్: జిల్లాలో రైస్‌మిల్లర్లు, ఎఫ్‌సీఐ గోదాం నిర్వాహకుల మధ్య కొద్దికాలంగా విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో మిల్లర్లు, గోదాంల నిర్వాహకుల మధ్య ఇటీవల సయోధ్య కుదిర్చేందుకు అదనపు కలెక్టర్ బీఎస్ లత ఇరువర్గాలతో సమావేశం నిర్వహించి ఎలాంటి బేధాలు లేకుండా సజావుగా బియ్యం సేకరించాలని సూచించినా అవేం పట్టించుకోవడం లేదు. దీంతో మిల్లర్లు తరలించిన ధాన్యం లారీలు గోదాంల వద్దే పడిగాపులు కాస్తున్నారు.


