కేజీబీవీల్లో ‘చెలిమి’ | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీల్లో ‘చెలిమి’

Jul 25 2026 1:59 AM | Updated on Jul 25 2026 1:59 AM

● ఆరో తరగతి విద్యార్థినుల కోసం వినూత్న కార్యక్రమం ● ఆటపాటలు, యోగా, సృజనాత్మక నైపుణ్యాలతో శిక్షణ

గొల్లపల్లి: కొత్తగా హాస్టల్‌లో చేరిన విద్యార్థినుల్లో ఇంటిపై బెంగను పోగొట్టి, వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ) సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నాయి. ‘చెలిమి’ పేరుతో రూపుదిద్దుకున్న ఈ ప్రత్యేక కార్యక్రమం చిన్నారుల్లోని మానసిక ఒత్తిడిని దూరం చేస్తూ వారిలోని అద్భుతమైన సృజనాత్మక నైపుణ్యాలను వెలికితీస్తోంది.

రోజుకు గంట.. 45 రోజుల శిక్షణ

జిల్లాలోని 16 కేజీబీవీల్లో 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో దాదాపు 540 మంది బాలికలు చేరారు. మొదటిసారిగా ఇల్లు వదిలి హాస్టల్‌ వచ్చిన చిన్నారుల్లో బెరుకును తొలగించి వారిని చదువు వైపు మళ్లించేందుకు జూన్‌ 20న ‘చెలిమి’కి శ్రీకారం చుట్టారు. రోజు సాయంత్రం 3.30 నుంచి 4.30వరకు గంట పాటు ఆగస్టు రెండోవా రం వరకు 45రోజులు ఈ శిక్షణ కొనసాగుతుంది.

చిన్నారుల్లో ఉత్సాహం నింపేందుకు..

చిన్నారుల్లో ఉత్సాహం నింపేందుకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, గ్రూప్‌ డిస్కషన్‌, మాటల నేర్పరితనం, ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి రోల్‌ ప్లే కథలు, సృజనాత్మకతను పెంచేందుకు పేపర్‌ క్రాఫ్ట్‌, కాగితాలతో రకరకాల ఆకృతులు తయారు చేయిస్తున్నారు.

ఇంటి బెంగ పోయింది

హాస్టల్‌కు వచ్చిన కొత్తలో చాలా భయంగా అనిపించేది. ‘చెలిమి’ వల్ల ఆహ్లాదకరంగా మారింది. టీచర్లు ఆటపాటలతో ప్రోత్సహిస్తూ మాలోని ప్రతిభను వెలికితీస్తున్నారు. నాలో భయం పోయి, ఇంటిపై ధ్యాస తగ్గి చదువుపై దృష్టి పెట్టగలుగుతున్న.

వర్షిణి, ఆరో తరగతి విద్యార్థిని, కేజీబీవీ, గొల్లపల్లి

భవిష్యత్తుకు బలమైన పునాది

బాలికల సర్వతోముఖాభివృద్ధి కి తోడ్పడుతోంది. విద్యాభ్యాసంతో పాటు సామాజిక నైపుణ్యాలను అలవర్చుకుంటూ భవిష్యత్‌కు బలమైన పునాది వేసుకుంటున్నారు. ఉపాధ్యాయుల నిరంతర పర్యవేక్షణతో కేజీబీవీల్లో మెరుగైన ఫలితాలకు బాటలు పడుతున్నాయి.

– నీరజ, జీఈసీవో

ఒత్తిడిని అధిగమిస్తున్నారు

చెలిమి ద్వారా విద్యార్థినులు మానసిక ఒత్తిడిని సులువుగా అధిగమిస్తున్నారు. డ్రాయింగ్‌, యోగా, రోల్‌ ప్లే, సింగింగ్‌ వంటి శిక్షణ ఇస్తుండటంతో ఆసక్తి కనబరుస్తున్నారు. మేము ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ స్నేహపూర్వక వాతావరణంలో బోధన సాగిస్తున్నాం.

– పద్మ, స్పెషల్‌ ఆఫీసర్‌, కేజీబీవీ, గొల్లపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement