మెట్‌పల్లిరూరల్: జిల్లాలో నిత్యం ఏదోచోట ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వాహనాలు పట్టుబడుతూనే ఉన్నాయి. రెవెన్యూ, పోలీస్ అధికారులు ఇసుక వాహనాలు పట్టుకుంటూనే ఉన్నారు. మరోవైపు రహస్య ప్రాంతాల్లో నిల్వ చేస్తున్న ఇసుక డంపులను సీజ్ చేస్తున్నారు. అయినప్పటికీ ఇసుక అక్రమ రవాణా మాత్రం ఆగడంలేదు. ఇసుక తవ్వకాలు, రవాణా విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తుండడంతో.. తమ రూటును మార్చిన ఇసుకాసురులు పంథాను మార్చుకుని దందా చేస్తున్నారు. సెలవు దినాల్లో వాగుల్లోకి ట్రాక్టర్లను పంపించి ఇసుకను తరలిస్తున్నారు. మెట్‌పల్లి మండలంలో అధికారులు ఇసుక విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ దందా మాత్రం ఆగడంలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సెలవు దినమంటూ ఇష్టారాజ్యం
ఇసుక విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తుండడంతో తమ రూటు మార్చిన మాఫియా సెలవు దినాల్లోనే వాగుల్లో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఆదివారం సెలవు దినమంటూ.. అధికారులెవరూ అందుబాటులో ఉండరంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అడ్డగోలుగా తవ్వుతున్న ఇసుకను ట్రాక్టర్లు, టిప్పర్లు, లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలించడంతోపాటు డంప్ చేస్తున్నారు. గత ఆదివారం మెట్‌పల్లి మండలం ఆత్మకూర్ పెద్దవాగులో సుమారు 50కి పైగా ట్రాక్టర్లను వాగులోకి పంపించి ఇసుక రవాణా చేశారు. తాజాగా ఈ ఆదివారం కూడా వాగులోకి ట్రాక్టర్లను పంపించి ఇసుక తరలించారు. వేకువజాము నాలుగు గంటలకు ప్రారంభమైన ఇసుక తవ్వకాలు.. మధ్యాహ్నం వరకు కొనసాగాయి. అధికారులకు ఫిర్యాదు వెళ్లగా వారంతా అక్కడికి చేరుకునేసరికి తవ్వకాలు నిలిపివేశారు. ఇసుకలోడ్‌తో వెళ్తున్న ఓ ట్రాక్టర్‌ను పట్టుకుని సీజ్ చేశారు.
మెట్‌పల్లి మండలం నుంచి యథేచ్ఛగా రవాణా
సెలవు దినాల్లోనే అక్రమంగా తవ్వకాలు
అధికారులు అందుబాటులో ఉండరని ఇష్టారాజ్యం
వాగుల్లో ఎటుచూసినా ఇసుక ట్రాక్టర్లే..
ఒక్కో ట్రిప్పుకు రూ.వెయ్యి వసూలు
ఆత్మకూర్ పెద్దవాగులో ఇసుక తవ్వకాలు వీడీసీ ఆధ్వర్యంలో కొనసాగగా.. ఒక్కో ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.వెయ్యి వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకు ఓ ఆలయానికి సంబంధించిన పేరు ఉన్న రశీదు ఇస్తున్నారు. నాలుగు రోజుల క్రితమే ఇసుక తవ్వకాల విషయంపై పోలీసులు ఆత్మకూర్ వీడీసీ సభ్యులను పిలిపించి హెచ్చరించారు. అయినప్పటికీ వీడీసీకి చెందిన పలువురు వాగులో ఉండి ఇసుకకు డబ్బులు వసూలు చేయడం గమనార్హం.
తరలిస్తే సమాచారం ఇవ్వాలి
ఇసుకను అక్రమంగా తవ్వకాలు చేపడితే సమాచారం ఇవ్వాలి. గ్రామాల్లో జీపీవోలతో నిఘా ఉంచాం. మాకు ఫిర్యాదు వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే పలు ట్రాక్టర్లు పట్టుకోవడంతోపాటు డంపులు సీజ్ చేశాం.
– నీత, తహసీల్దార్, మెట్‌పల్లి
కేసులు నమోదు చేస్తున్నాం
ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు. ఇటీవల 5 ఇసుక లారీలు, ట్రాక్టర్లను పట్టుకున్నాం. వాటి యజమానులపై కేసులు నమోదు చేశాం. రాత్రివేళ ఇసుక అక్రమ రవాణా జరగకుండా నిఘా పెంచుతాం. ప్రజలు సమాచారం ఇవ్వాలి.
– కిరణ్‌కుమార్, ఎస్సై, మెట్‌పల్లి


