జగిత్యాల: పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో కార్పొరేట్ విద్యాసంస్థలు ఇప్పటినుంచే అడ్మిషన్లు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. పరీక్షలు ముగియకముందే విద్యార్థులను మభ్యపెట్టి కళాశాలల్లో చేర్పించుకోవడంపై దృష్టి సారించాయి. ఇప్పటికే కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు పీఆర్వోలను నియమించుకుని ప్రచారం చేస్తున్నాయి. ప్రతి విద్యార్థికి సంబంధించిన అడ్రస్‌లు సేకరించి వారి తల్లిదండ్రులను కలిసి తమ కళాశాలలో మెరుగైన విద్య, ఫీజులు తక్కువ అని చెబుతూ ఎలాగైనా అడ్మిషన్ తీసుకునేలా ప్రయత్నిస్తున్నాయి. మొదటి సంవత్సరం మంచి మార్కులు సాధిస్తే రెండో సంవత్సరం ఫీజు కట్టనవసరం లేదంటూ పేర్కొంటున్నాయి. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, విజయవాడ వంటి పెద్దపెద్ద నగరాల్లో ఉన్న కార్పొరేట్ కళాశాలలు కూడా ఇలాగే ప్రచారం చేస్తుండడం గమనార్హం. పీఆర్వోల ద్వారా అడ్మిషన్లు తెప్పించుకుని సొమ్ము చేసుకుంటున్నాయి.
కరపత్రాల పంపిణీ
పరీక్షల సమయంలో ఇంటి వద్దనున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లి కార్పొరేట్ కళాశాల కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. మొదటి నుంచి ఎంసెట్, ఐఐటీ, జేఈఈ లాంటి కోర్సుల్లో చదువు ఉంటుందని, జాయిన్ కావాలని ఒత్తిడి తెస్తున్నారు. గతంలో ర్యాంకులు సాధించిన విద్యార్థుల ఫొటోలు చూపిస్తూ తమ కళాశాలల్లో చదివారని, వారు పెద్ద పొజి షనలో ఉన్నారని తల్లిదండ్రులకు వివరిస్తున్నారు.
అప్పు చేసైనా కార్పొరేట్ కళాశాలలోకి..
పీఆర్వోల మాటలు, వారి ఆకర్షణీయమైన పాంప్లెంట్ల వైపు విద్యార్థుల తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారని తెలుస్తోంది. ముందస్తుగా కొద్దిగా డబ్బు చెల్లిస్తే చాలు అడ్మిషన్ అయినట్లేనని భావిస్తున్నారు. గతంలో విద్యార్థులను బలవంతంగా కార్పొరేట్ కళాశాలలో చేర్పిస్తే చాలామంది ఒత్తిడికి లోనైన సంఘటనలున్నాయి. అక్కడి వాతావరణం నచ్చకుంటే విద్యార్థులు తిరిగి ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ.. సదరు కళాశాళలు ఫీజులు మాత్రం రిటర్న్ ఇవ్వరు. ముందుగా ఆ కళాశాల గురించి తెలుసుకుని, అందులో ఎలాంటి ఉపాధ్యాయులున్నారు..? విద్యాబోధన ఎలా ఉంది..? తెలుసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. వారి మాటలు నమ్మి వెంటనే అడ్మిషన్ పొందవద్దని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆచీతూచి వ్యవహరించాలని పేర్కొంటున్నారు.
ప్రతి ఇంటికి ఫోన్
కార్పొరేట్ కళాశాలల పీఆర్వోలు ప్రతి ఒక్కరి ఫోన్ నంబరు సేకరించి ఉదయం కాగానే తమ కళాశాలలో చేర్పించండి.. మంచి విద్య, ఫీజులు తక్కువగా ఉంటాయంటూ పేర్కొంటున్నారు. అడ్రస్‌లు కూడా తెలుసుకుని ఇంటికి వెళ్తూ తమ కళాశాలలో చేర్పిస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని నమ్మ బలుకుతున్నారు. పదో తరగతి పరీక్షలు ఇంకా ముగియకముందే అడ్మిషన్లు చేసుకుంటున్నారు.
ఇంటర్ అడ్మిషన్ల దందా
ఇప్పటి నుంచే షురూ
ఆఫర్లు ప్రకటిస్తున్న పీఆర్వోలు


