డీఆర్‌సీ.. ఉన్నచోట కాదని | - | Sakshi
Sakshi News home page

డీఆర్‌సీ.. ఉన్నచోట కాదని

Mar 16 2026 7:50 AM | Updated on Mar 16 2026 7:50 AM

రాయికల్‌ బల్దియా ఇంజినీరింగ్‌ అధికారుల అనాలోచిత నిర్ణయం చర్చకు దారితీసింది. ఇప్పటికే ఉన్న డీఆర్‌సీ (డ్రై రీసెర్చ్‌ సెంటర్‌)ని వినియోగంలోకి తేవాల్సింది పోయి కొత్తగా మరోచోట నిర్మించేందుకు రూ.40లక్షలతో ప్రతిపాదనలు రూపొందించారు. పైగా ఈ అంశాన్ని సోమవారం నిర్వహించే సాధారణ సమావేశంలో ఆమోదింపజేందుకు సంకల్పించడం చర్చనీయాంశంగా మారింది.

రాయికల్‌: బల్దియాలో 12వార్డులున్నాయి. ఈ వార్డుల నుంచి సేకరించిన తడి, పొడి చెత్తను వేరుచేసేందుకు రెండేళ్ల క్రితం పట్టణంలోని ఒడ్డెరకాలనీ సమీపంలోని డంపింగ్‌యార్డు వద్ద డీఆర్‌సీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను వేరుచేసి తడి చెత్తను కంపోస్టు ఎరువుగా.. పొడిచెత్తను రీసైక్లింగ్‌ చేయాల్సి ఉంది. తడిచెత్త ద్వారా కంపోస్టు ఎరువు తయారీ ద్వారా మున్సిపల్‌కు ఆదాయం సమకూరుతుందని భావించారు. కానీ.. అధికారుల నిర్లక్ష్యంతో సదరు డీఆర్‌సీ కేంద్రం నిరుపయోగంగా మారింది. రెండేళ్లుగా దాని నిర్వహణ పట్టించుకోవడం లేదు. వినియోగంలోకి తీసుకురావాల్సిన అధికారులు.. తాజాగా 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.40లక్షల వ్యయంతో డీఆర్‌సీ నిర్మాణానికి మైతాపూర్‌ రోడ్‌లోగల ఓపెన్‌వెల్‌ పక్కన ఖాళీ స్థలాన్ని గుర్తించారు. కౌన్సిల్‌ సాధారణ సమావేశంలో ఈ అంశాన్ని ప్రవేశపెట్టి ఆమోదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

పక్కనే బావి..

డీఆర్‌సీ ఏర్పాటుకు ఇంజినీరింగ్‌ అధికారులు ప్రతి పాదించిన స్థలం సమీపంలోనే తాగునీటి బావి ఉంది. ఆ బావి నుంచి మున్సిపల్‌ ప్రజలకు ప్రతిరోజూ నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడ కేంద్రం నిర్మిస్తే వర్షాకాలంలో చెత్త అంతా బావిలోకి చేరే అవకాశం ఉంది. పైగా మురుగు నీరంతా గ్రామంలోని చెరువులోకి.. పక్కనే ఉన్న బావిలోకి చేరి కలుషితం అవుతుంది. పైగా మైతాపూర్‌ గ్రామ సరిహద్దులో ఉండడం ద్వారా మైతాపూర్‌, రాయికల్‌కు చెందిన రైతుల పంట పొలాలు తీవ్రంగా నష్టపోతారని స్థానికులు చెబుతున్నారు.

చైర్మన్‌కు తెలియకుండానే..?

మున్సిపాలిటీ సాధారణ సమావేశాల అంజెండా అంశాలు మున్సిపల్‌ చైర్మన్‌ కట్కం రవికి తెలియకుండానే రూపొందించడం చర్చనీయాంశంగా మారింది. డీఆర్‌సీసీ కేంద్రం ఏర్పాటుపై ఇంజినీరింగ్‌ అధికారులు కనీసం మున్సిపల్‌ చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లకుండానే ప్రతిపాదనలు రూపొందించడమేంటని స్థానికంగా చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారంపై పాలకమండలి సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పనితీరును తప్పుపడుతున్నారు. మున్సిపల్‌ ఎజెండాలో ఈ అంశం పెట్టినప్పటికీ వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే చర్చ నడుస్తోంది. మున్సిపల్‌ చైర్మన్‌ రవి, పాలకమండలి సభ్యులు స్పందించి బావి పక్కన ఏర్పాటు చేయాలని భావిస్తున్న డీఆర్‌సీసీ కేంద్రం ప్రతిపాదనను తోసిపుచ్చాలని, ఇప్పటికే ఉన్న డీఆర్‌సీసీ కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

రాయికల్‌లో రెండేళ్ల క్రితమే కేంద్రం ఏర్పాటు

వినియోగంలోకి తేలేక మరోచోట నిర్మాణానికి నిర్ణయం

రూ.40లక్షలతో ఇంజినీరింగ్‌ అధికారుల ప్రతిపాదనలు

నేటి కౌన్సిల్‌ సాధారణ సమావేశంలో ఆమోదానికి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement