● రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
● విద్యార్థుల అవస్థలకు చెల్లు
కోరుట్ల: మార్చి మొదటి వారం నుంచే ఉష్ణోగ్రతలు మంటపుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఒక్కపూట నడిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పెరిగిన వేడి నుంచి విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఉపశమనం దొరకనుంది. ఏప్రిల్ 23 వరకు బడులు ఒంటిపూటనే కొనసాగనున్నాయి. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు.
ఉదయం 8 గంటల నుంచి..
ఒంటిపూట బడులు ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 వరకు కొనసాగనున్నాయి. 12.30గంటలకు మధ్యాహ్న భోజనం ముగిశాక విద్యార్థులు ఇళ్లకు వెళ్లాల్సి ఉంటుంది. ఉదయం 8 గంటలకే తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఇప్పటికే తగిన విధంగా క్లాసుల వేళల్లో మార్పులు చేసుకున్నారు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
వారంరోజులుగా ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు చేరుకున్నాయి. జిల్లాలో మొత్తం 480 ప్రాథమిక పాఠశాలలు, 240 ప్రాథమికోన్నత పాఠశాలలు, 347 ఉన్నత పాఠశాలల్లో తొమ్మిదో తరగతి లోపు విద్యార్థులు మొత్తం 98,200 మంది చదువుతున్నారు. చాలాచోట్ల వసతులు సరిగా లేవు. కొన్నిట్లో తాగునీటికీ ఇబ్బంది ఉంది. ఎండవేడి నుంచి పిల్లలకు ఉపశమనం కలిగించేందుకు అవసరమైన ఫ్యాన్లు ఇతరత్రా ఏర్పాట్లు లేకపోవడం గమనార్హం. కొన్ని పాఠశాలల్లో తరగతి గదుల్లోకి గాలి, వెలుతురు సరిగా రాక ఉదయం 11 గంటలకే విద్యార్థులు ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు. దీంతో పాటు ఉదయం 9 గంటలకే వేడి పెరిగిపోవడం విద్యార్థుల ఆరోగ్యరీత్యా సమస్యలు సృష్టించే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఒంటి పూట బడులతో విద్యార్థులకు చక్కని ఉపశమనం దక్కుతుంది.
అంజన్న సన్నిధిలో రాజస్థాన్ ఎస్పీ పూజలు
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి వారిని ఆదివారం రాజస్థాన్ రాష్ట్రం శిఖర్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ నాయక్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఆయన వెంట రాష్ట్ర సీఐడీ ఏఎస్పీ బాలకోటి ఉన్నారు.
సమాజ హితం కోరేది బ్రాహ్మణులే
ధర్మపురి: బ్రాహ్మణులు నిత్యం సమాజహితం కోరుకుంటారని, అలాంటి వారిని ఓ ఎమ్మెల్యే కించపరిచేలా మాట్లాడడం సరికాదని బ్రాహ్మణ సంఘం నాయకులు, మహిళలు డిమాండ్ చేశారు. తుంగతుర్తి ఎమ్మెల్యే వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం పట్టణంలో నిరసన చేపట్టారు. బ్రాహ్మణులను కించపరిచేలా అసభ్య పదజాలంతో మాట్లాడడాన్ని ఖండించారు. ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే పెద్దఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ఇందారపు రామన్న, మహిళలు తాడూరు, కొరిడె రమాదేవి, మున్సిపల్ కౌన్సిలర్ సంతోషి, శారద మహిళామండలి సభ్యులు తదితరులున్నారు.


