జగిత్యాలక్రైం: దుబాయ్‌లో కోమాలో ఉన్న జగిత్యాల జిల్లా వాసిని ఆదుకుని, ఆస్పత్రి బిల్లు మాఫీ చేసి స్వదేశానికి రప్పించాలని ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన నిరుపేద యువకుడు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లాడు. లక్షల్లో పేరుకుపోతున్న బిల్లులు కట్టలేక ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగిన్‌పల్లికి చెందిన కొండ్ర రాజేశ్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. ఇటీవల సోరియాసిస్‌తో ఫిబ్రవరి 27న దుబాయ్‌లోని ఆస్టర్ హాస్పిటల్‌లో చేరిన ఆయన, చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించి కోమాలోకి వెళ్లిపోయాడు. మార్చి 3వ తేదీ నాటికే ఆసుపత్రి బిల్లు ఏకంగా రూ.13,23,383 చేరుకుంది. అంత భారీ మొత్తంలో బిల్లు చెల్లించే స్థోమత లేకపోవడంతో కుటుంబ సభ్యులు యువజన నాయకుడు తలారి రాజేశ్‌తో కలిసి జగిత్యాలలో మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డిని ఆశ్రయించారు. స్పందించిన జీవన్‌రెడ్డి ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్‌చైర్మన్ మంద భీంరెడ్డితో మాట్లాడి బాధితుడికి తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు రాజేశ్ భార్య అనూష శుక్రవారం హైదరాబాద్‌లోని సీఎం ప్రవాసీ ప్రజావాణికి దరఖాస్తు చేసుకున్నారు. బాధితుడి వివరాలను కేంద్ర ప్రభుత్వ మదద్ పోర్టల్ ద్వారా దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల దృష్టికి తీసుకెళ్లారు.


