రాజన్నకు స్వయం ప్రతిపత్తి | - | Sakshi
Sakshi News home page

రాజన్నకు స్వయం ప్రతిపత్తి

Feb 24 2026 7:23 AM | Updated on Feb 24 2026 7:23 AM

రాజన్నకు స్వయం ప్రతిపత్తి

రాజన్నకు స్వయం ప్రతిపత్తి

● కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ● పునర్నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలంటున్న భక్తులు

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: తెలంగాణలో ప్రముఖ శైవక్షేత్రంగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి స్వయం ప్రతిపత్తి హోదా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. స్వయం ప్రతిపత్తి అమల్లోకి వస్తే ఆలయ పరిపాలనలో విస్తృత మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. ఆలయ పనర్నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. ఆర్థిక, పరిపాలనా వ్యవహారాల్లో స్వతంత్ర నిర్ణయాధికారం లభించనుంది. హుండీ ఆదాయం, దానాల వినియోగం, అభివృద్ధి పనులు, టెండర్ల ప్రక్రియ, సిబ్బంది నియామకాలు వంటి అంశాల్లో ఆలయ ట్రస్ట్‌ బోర్డు స్వయంగా నిర్ణయాలు తీసుకునే వీలుంటుంది. దేవాదాయశాఖ పర్యవేక్షణ పరిమితస్థాయిలో మాత్రమే కొనసాగనుందని తెలుస్తోంది. ఈ అంశంపై శ్రీసాక్షిశ్రీలో వెలువడిన కథనాలకు ప్రభుత్వం స్పందిస్తూ, ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలే తమ ప్రాధాన్యతగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశముంది.

భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యం

ఆలయ పనర్నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యాలు, విస్తరణ, క్యూలైన్‌ వ్యవ స్థ ఆధునీకరణ, వసతిగృహాల నిర్మాణం, పార్కింగ్‌ విస్తరణ, డిజిటల్‌ సేవల అమలు వంటి కార్యక్రమాలు వేగవంతం కానున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఆలయానికి వచ్చే ఆదాయం పూర్తిగా అభివృద్ధి, సేవా కార్యక్రమాలకే వినియోగించేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. స్వయంప్రతిపత్తి అమలులో పారదర్శకత, బాధ్యతాయుత నిర్వహణ కీలకమని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఆలయ పరిపాలనలో అనుభవజ్ఞుడైన ఐఏఎస్‌ అధికారిని ఈవోగా నియమిస్తే సమర్థవంతమైన పాలన సాధ్యమవుతుందనే వాదన వినిపిస్తోంది. దీంతో వేములవాడ క్షేత్రం రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందే అవకాశముంది.

ఉగాది నాటికై నా పూర్తయ్యేనా?

రాజన్న ఆలయ పునర్నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. ప్రస్తుతం భీమన్నఆలయంలో భక్తులకు రాజన్న దర్శనాలు కల్పిస్తున్నారు. రాజన్న ఆలయ పునర్మిర్మాణంలో భాగంగా అధికారులు కట్టడాలను తొలగించడం వరకే ఆరునెలల సమయం గడిచింది. ఇప్పటి వరకు పిల్లర్లు వేసిన దాఖలాలు లేవు. సమ్మక్క జాతరకు లక్షలాది మంది భక్తులు రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. సమ్మక్క, శివరాత్రి జాతర ముగిసింది. కానీ రాజన్న దర్శనాలు మాత్రం భక్తులకు కలగడం లేదు. సమ్మక్క, శివరాత్రి జాతరల ఉత్సవాల సమయంలో రాజన్న దర్శనాలు ఉంటాయని భావించిన భక్తులకు నిరాశే మిగిలింది. భీమన్నను దర్శించుకున్న తరువాత కూడా రాజన్న మెట్ల వద్ద మొక్కి పోయిన భక్తులకు రాజన్న దర్శనం ఇంకెన్ని నెలలు పట్టవచ్చని ఎదురుచూస్తున్నారు. కనీసం ఉగాది నాటికైనా పునర్నిర్మాణ పనులు పూర్తిచేయాలని భక్తులు కోరుతున్నారు.

ధర్మగుండం స్నానాలు

భక్తులకు విశ్వాసం

రాజన్న ధర్మగుండంలో స్నానాలు చేస్తే ఎలాంటి అంటువ్యాధులైనా పోతాయని భక్తులకు ప్రగాడ విశ్వాసం. ధర్మగుండంలో స్నానం చేసి తడి బట్టలతో రాజన్నను దర్శించుకుంటారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ధర్మగుండంలో స్నానాలకు కూడా అవకాశం ఇవ్వకపోవడంతో భక్తులకు కొంత నిరాశ కలిగిస్తోంది. భీమన్న ఆలయానికి వెళ్లే దారిలో నల్లాలు, షవర్లతో జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement