పురం.. ఆదాయమే మూలం
జగిత్యాల: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు కొత్త పాలకవర్గం ఎన్నికై ంది. బల్దియాలను అభివృద్ధి వైపు నడిపించాలన్నా.. ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలన్నా ఆదాయ వనరులే ఆధారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతోపాటు వివిధ మార్గాల ద్వారా మున్సిపాలిటీలకు సమకూరే ఆదాయ వనరులను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటేనే ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించే అవకాశం ఉంటుంది. ఆ దిశగా కొత్త పాలకవర్గాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటున్నారు పట్టణ ప్రజలు. మున్సిపాలిటీలకు ప్రధానంగా ఆస్తిపన్నే ఆధారం. జగిత్యాలలో రూ.13 కోట్ల డిమాండ్ ఉండగా.. కోరుట్ల, మెట్‌పల్లిలో రూ.6 కోట్ల నుంచి రూ.7కోట్లుగా ఉంది. ప్రతి మున్సిపాలిటీల్లో ఈ నిధులతోనే అభివృద్ధి పనులు చేసే అవకాశం ఉంటుంది. బల్దియాల్లో ఖాళీ స్థలాలకూ ఆస్తిపన్ను విధించే అవకాశం ఉన్నా.. గత పాలకవర్గాలు ఎప్పుడూ పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి.
ఖాళీ స్థలాలపై దృష్టి పెట్టాలి
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు ఉండగా.. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లిలో మున్సిపల్ స్థలా లు అత్యధికంగా ఉన్నాయి. ప్రధానమైన చోట ఉండటంతో ఎక్కడబడితే అక్కడ ఆక్రమణలకు పాల్ప డి మున్సిపాలిటీలకు నామమాత్రపు ఫీజులు చెల్లిస్తూ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఖాళీ స్థలాలపై దృష్టి పెట్టి ఆదాయం పన్ను పెంచుకుని ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. తైబజార్ కొన్ని మున్సిపాలిటీల్లో లేదు. దీనిని కూడా ఏర్పాటు చేసుకుంటే మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.
పలు నిధుల ద్వారా ఆదాయం
14వ ఆర్థిక సంఘం నుంచి కేంద్రం ఏటా రెండుసార్లు నిధులు విడుదల చేస్తుంది. జనాభాను బట్టి ఈ నిధులు వస్తుంటాయి. వీటిని ప్రణాళిక, ప్రణాళికేతర పనులకు ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంది. స్వచ్ఛభారత్, పట్టణప్రణాళికకు వీటిని వినియోగిస్తుంటారు. స్టేట్ ఫైనాన్స్ ద్వారా వచ్చే నిధులను పారిశుధ్యం, ఇతరత్రా కార్యక్రమాలు చేసుకోవచ్చు. ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ వార్డుల్లో ప్రత్యేక నిధులు మంజూరవుతాయి. వీటి ద్వారా కాలనీలను అభివృద్ధి చేసుకోవచ్చు. ఇలా అనేక మార్గాల ద్వారా మున్సిపాలిటీలకు నిధులు వస్తుంటాయి. వీటిని సక్రమమైన పద్ధతిలో వినియోగిస్తే మున్సిపాలిటీలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది.


