నా గొంతు కోయాలని చూస్తున్నారు..
జగిత్యాలటౌన్: రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఫిరాయింపుదారులను రాళ్లతో కొట్టాలని చెప్పారని, మనం మాత్రం పార్టీ మారిన వారిని ఓట్లతో కొడదామని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జగిత్యాలలోని 24, 25 వార్డుల్లో తన అనుచరులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నా మీద కోపంతో నా వాళ్లకు టికెట్లు ఇవ్వకుండా చేసి నా గొంతు కోయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితం చివరి దశలో నన్ను క్షోభకు గురిచేస్తున్నారని భాగోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. జీవన్‌రెడ్డిని ఓదార్చిన స్థానిక మహిళలు 40 ఏళ్లుగా మాకు అండగా నిలుస్తున్న మీ వెన్నంటి ఉండి మీరు సూచించిన అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అంగడిబజార్‌లోని కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ పదేళ్లు అదికారంలో ఉండి సోయి లేకుండా ఉన్నోళ్లు ఇప్పుడు అభివృద్ధి జపం ఆలపిస్తూ కాంగ్రెస్ కుటుంబంలో చిచ్చు పెడుతున్నారని అన్నారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా నావారి కోసం కొట్లాడి తీరుతానని తెలిపారు. మీ అందరి ఆశీర్వాదంతో జగిత్యాల బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తానని జీవన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.


