అభివృద్ధితో ప్రత్యేక గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధితో ప్రత్యేక గుర్తింపు

Feb 6 2026 7:52 AM | Updated on Feb 6 2026 7:52 AM

అభివృ

అభివృద్ధితో ప్రత్యేక గుర్తింపు

అర్ధంతరంగా నిలిచిన పనులపై దృష్టిపెట్టాం

మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలు

‘సాక్షి’తో రామగుండం బల్దియా మాజీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ

కోల్‌సిటీ(రామగుండం): రామగుండం మొదటి మున్సిపల్‌ చైర్మన్‌గా పలు అభివృద్ధి పనులు, సంస్కరణలు చేపట్టి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి సోమారపు సత్యనారాయణ. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఆర్టీసీ చైర్మన్‌గా పని చేశారు. అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా గెస్ట్‌ ఫాకల్టీగా ఐఏఎస్‌ హోదా కలిగిన అధికారులకు పాఠాలు బోధించగల విజ్ఞానం ఆయన సొంతం. ఇంజినీరింగ్‌తోపాటు ఎంబీఏ చదివిన ఆయన తనకున్న సాంకేతిక పరిజ్ఞానం, మేనేజ్‌మెంట్‌ నైపుణ్యంతో చేపట్టిన పనులు మున్సిపల్‌ చైర్మన్‌ పదవికే వన్నె తెచ్చాయి. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న సత్యనారాయణను మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ‘సాక్షి’ పలకరించగా నాటి అనుభవాలు, విశేషాలను ఇలా పంచుకున్నారు.

సోమారపు సత్యనారాయణ

రామగుండం మొదటి చైర్మన్‌గా ఎన్నికైనప్పు డు ఉన్న పరిస్థితుల్లో మీ అనుభవం?

పాలకవర్గం లేకపోవడంతో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొని ఉన్న కాలంలో చైర్మన్‌గా ఎన్నికయ్యాను. సింగరేణి నీటి సరఫరా తప్ప మున్సిపల్‌ నీళ్లు లేవు. అక్కడక్కడా ఉన్న బోర్‌వెల్‌ నీరే ఆధారం. డ్రైనేజీ వ్యవస్థ, సరైన రోడ్లు కూడా లేవు. సింగరేణి స్థలాల్లో కట్టుకున్న ఇళ్లకు ఇంటి పన్ను లేకపోవడంతో నిధులు చాలా తక్కువ.

అలాంటి పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లారు..?

ముందుగా నిధుల కొరత అధిగమించే ప్రయత్నం చేశాను. సింగరేణి స్థలాల్లో కట్టుకున్న ఇళ్లకు నంబర్లు ఇచ్చి నామమాత్రపు పన్ను విధించాం. దగ్గరున్న బ్యాంకుల్లో కట్టుకోవడానికి వీలుగా చలానాలు పంపిణీ చేశాం. ఆ రశీదుల కారణంగానే తర్వాత కాలంలో వారికి సింగరేణి స్థలాల క్రమబద్ధీకరణలో భాగంగా ఇళ్ల పట్టాలు ఇచ్చారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్మెంట్‌ నిధులు పొందడానికి రామగుండంకు అర్హత ఉండగా, నాటి సీఎంను ఒప్పించి ముందుగానే నిధులు రాబట్టి అభివృద్ధి పనులు చేపట్టాం.

దేనికి ప్రాధాన్యత ఇచ్చారు?

తాగునీటి సరఫరాపై ముందు దృష్టిపెట్టాను. పబ్లిక్‌ హెల్త్‌ ఇంజినీరింగ్‌ విభాగం ద్వారా అర్ధాంతరంగా నిలిచిన పనులపై దృష్టిపెట్టి, హెడ్‌ వర్క్స్‌, ట్యాంకులు నిర్మించడంతో మున్సిపల్‌ నీటి సరఫరా ప్రారంభమైంది. ఆ తర్వాత 24 గంటల నీటి సరఫరా చేసి దేశం దృష్టిని ఆకర్షించేలా చేయగలిగాను.

ఆ తర్వాత దేనిపై దృష్టి పెట్టారు?

పారిశుధ్యం దృష్టి పెట్టాను. శానిటేషన్‌తో పాటు సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌లో దేశంలోనే మొదటిసారిగా తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించడం జరిగింది. చెత్త ఏరుకొని జీవించే వారిని గుర్తించి, వారికి పరుగు పందెం నిర్వహించి శారీరక సామథ్యం ఉన్నవారికి ఉచితంగా రిక్షాలు ఇచ్చి ఇంటింటా చెత్త సేకరించడం జరిగింది. అలాగే ఎడ్ల బండ్లతో చెత్త సేకరించే పారిశుధ్య కార్మికులకు ఆటోలు ఇచ్చాం. స్వశక్తి సంఘాలకు బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు ఇప్పించి ట్రాక్టర్లు కొనుగోలు చేయించాం. వాటికి మున్సిపల్‌ నుంచి అద్దె చెల్లించడం ద్వారా ఒకపక్క ఉపాధి పొందడంతోపాటు మరో పక్క రుణం తీరిపోయి, వారే ఆ వాహనాలకు యజమానులయ్యారు.

రోడ్లు, కాలువలను ఎలా అభివృద్ధి చేశారు?

మున్సిపాలిటీలో నిధుల్లేవు, పబ్లిక్‌, ప్రయివేట్‌ పార్టీసిపేషన్‌ అంటే నగరపాలక సంస్థ, ప్రజల భాగస్వామ్యంతో 80: 20 ప్రాతిపదికన ఎవరూ ముందుకొస్తే అక్కడ రోడ్లు, కాలువలు నిర్మించాం. నా చొరవతో నాటి ముఖ్యమంత్రి డీఎఫ్‌ఐడీ నిధులు రామగుండంకు మంజూరు చేయడంతో రోడ్లు, కాలువలు వంటి అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం దొరికింది.

వినూత్నంగా ఆలోచించి చేపట్టిన పనులేవి?

పట్టణానికి తగినట్టుగా దేశంలోనే మొదటిసారిగా బేబీ డ్రెయిన్లతో కాలువల నిర్మాణం చేపట్టాం. డ్రై వెదర్‌ డ్రెయిన్‌, ఫెర్రో సిమెంట్‌ డ్రెయిన్ల నిర్మాణం నా హయాంలో చేపట్టడం జరిగింది. అత్యంత మన్నికతో వేసిన సీసీ రోడ్లు కొన్ని చోట్ల ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. మీటర్లు ఏర్పాటు చేసి వాడిన నీటికే బిల్లు తీసుకున్నాం. జనన, మరణ ధ్రు వీకరణ పత్రాలు కొరియర్‌ ద్వారా ఇంటికే పంపాం. పైరవీలకు తావు లేకుండా జరిగింది.

కొత్త వెలుగు కోసం ఏం చర్యలు తీసుకున్నారు?

చాలా మంది రిటైర్డ్‌ కార్మికులు ఇక్కడ సరైన వసతులు లేవని ఇతర ప్రాంతాలు, సొంత ఊళ్లకు వెళ్తున్న తరుణంలో అందరికీ అందుబాటులో ఉండేలా మున్సిపల్‌ కార్యాలయ భవనం, వినూత్న డిజైన్‌తో కొత్త కూరగాయల మార్కెట్‌ నిర్మించాను. ఐడీఎస్‌ఎంటీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ భవనానికి నిధులు మంజూరు చేయించి పునాది వేశాను. తాగునీటి సరఫరా, సెంట్రల్‌ లైటింగ్‌, ఇంటి ముందుకే చెత్త బండి రావడం తదితర సౌకర్యాలు సమకూరడంతో ఇళ్ల నిర్మాణం పెరిగింది. స్వశక్తి మహిళలకు సీఆర్‌సీ భవనం నిర్మించి, వారితో సూపర్‌ మార్కెట్లు పెట్టించాం. నేపాల్‌ నుంచి నిపుణులను రప్పించి టోపీలు కుట్టించే శిక్షణ ఇప్పించాను. మలుపు అనే పథకం ద్వారా వందల మందికి చెప్పులు కుట్టే శిక్షణ ఇప్పించాను. ఇలా అనేక ఉపాధి అవకాశాలు కల్పించాను.

మీ పనులు ప్రభావితం చేశాయా?

చేశాయి. దేశ, విదేశాల నుంచి ఎంతో మంది స్టడీ టూర్‌లో భాగంగా రామగుండం సందర్శించారు. మున్సిపల్‌ విద్యుత్‌ బిల్లుల్లో రామగుండంకు రూ.25లక్షలు నేను రికవరీ చేసిన విధానం నచ్చి, అలాగే చేయాలని అన్ని మున్సిపాలిటీలకు నాటి ముఖ్యమంత్రి సర్క్యులర్‌ జారీ చేయించారు. రాగ్‌పిక్కర్‌ విధానం, 24 గంటల నీటి సరఫరా తీరును అనేక మంది పరిశీలించి వెళ్లారు.

చైర్మన్‌గా గొప్పగా భావించేది ఏది?

మురికివాడలను అభివృద్ధి చేయడం అన్నింటి కంటే ఎక్కువగా చెప్పుకోతగ్గది. నాడు రామగుండంలో 45 నోటిఫైడ్‌ 47 నాన్‌ నోటిఫైడ్‌ స్లమ్స్‌ ఉండేవి. నేను చేపట్టిన పనులతో అవి ఇప్పుడు స్లమ్స్‌లా కనబడతలేవు.

గుర్తింపు వచ్చిన సందర్భాలు ఉన్నాయా?

అవార్డులకు ఎప్పుడూ నామినేషన్‌ వేయలేదు. కానీ, చేంజ్‌ మేనేజ్‌మెంట్‌ ఫోరంలో దేశంలో కేవలం ఇద్దరు మున్సిపల్‌ చైర్మన్లను ఎంపిక చేయగా, అందులో నేను ఒక్కడిని కావడం నాకు ఇచ్చిన పెద్ద గుర్తింపుగా భావిస్తున్న.

ఏమైనా సలహాలు ఇస్తారా?

ఎవరి ఐడియాలజీ వారికి ఉంటుంది. ఆ ఐడియాలజీ ప్రకారం పని చేసుకుంటూ పోతారు.

అభివృద్ధితో ప్రత్యేక గుర్తింపు1
1/1

అభివృద్ధితో ప్రత్యేక గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement