అడవుల్లో జంతుగణన
జగిత్యాలరూరల్: అడవుల్లో సంచరించే జంతువులను ప్రభుత్వం నాలుగేళ్లకోసారి లెక్కిస్తుంది. ఇందులోభాగంగా అడవి సిబ్బంది, క్షేత్రస్థాయి అధికారులు అడవుల్లో తిరుగుతూ జంతుగణన చేపడతారు. ఇందులో శాకాహారం, మాంసాహారం జంతువులను వేర్వేరుగా లెక్కిస్తారు. జిల్లాలోని నాలుగు సెక్షన్ల పరిధిలో నాలుగురోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది.
67 బీట్లలో..
జిల్లాలో నాలుగు సెక్షన్ల పరిధిలో 67బీట్లు ఉన్నాయి. ఇందులో సంచరించే జంతువులను లెక్కించనున్నారు. ప్రతి బీట్‌లో ఇద్దరు చొప్పున 134 మంది సర్వేలో పాల్గొంటారు. ఈనెల 25 వరకు రోజుకు రెండు విడతలుగా సర్వే చేపట్టనున్నారు. జంతువుల అడుగులు, మూత్రం, వాసన, పేడతోపాటు ఇతర ఆధారాలు సేకరించి సదరు జంతువు ఉన్నట్లు గుర్తిస్తారు. టైగర్ జోన్ ప్రాంతాల్లో సీసీ కెమెరాల కదలికల ప్రకారం లెక్కించనున్నారు.
రెండు విడతల్లో సర్వే..
సర్వే బృందాలు ఉదయం 6.30 గంటల నుంచి 10.30 వరకు.. మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరు వరకు జంతువులు సంచరించే ప్రాంతాల్లో తిరుగుతూ క్షుణ్ణంగా సర్వే చేపట్టనున్నారు. జంతుగణనపై జిల్లా అటవీశాఖ కార్యాలయంలో అధికారులు, సిబ్బందికి అటవీశాఖ అధికారి రవిప్రసాద్ అవగాహన కల్పించారు. సర్వేలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలపై వివరించారు.
కొడిమ్యాల: అడవులంటే చెట్లే కాదు.. అవి జీవ వైవిధ్యానికి ఊపిరి. వన్యప్రాణులకు నిలయం.
అలాంటి అడవుల్లో ఒకటిగా కొడిమ్యాల రేంజ్ ఫారెస్ట్ నిలుస్తోంది. విస్తీర్ణం, వన్యప్రాణుల ఉనికి, సహజ సౌందర్యంతో ఈ అడవి అభయారణ్యానికి ఏమాత్రం తీసిపోని విధంగా మారింది. ఈ రేంజ్ పరిధి 12,256.83 హెక్టార్లు విస్తరించి ఉంది. ఈ అ డవిని కొడిమ్యాల, కొండగట్టు, ఓబులాపూర్, గో విందారం అనే నాలుగు సెక్షన్లుగా విభజించారు. విశాలమైన ఈ అటవీ ప్రాంతం అనేక శాకాహార, మాంసాహార జంతువులకు సురక్షిత నివాసంగా మారింది. ఫారెస్ట్‌ను నాలుగు సెక్షన్లుగా విభజించడం ద్వారా అటవీ సంరక్షణ మరింత సమర్థవంతంగా కొనసాగుతోంది. విస్తీర్ణం ఎక్కువగా ఉండటంతో వన్యప్రాణులకు ఆహారం, నీరు, ఆశ్రయం లభిస్తోంది.
శాకాహారం, మాంసాహార జంతువులతో జీవ వైవిధ్యం
అడవిలో చుక్కల దుప్పి, నీల్‌గాయి, మార్ణంగి, జింకలు, ఎలు గుబంట్ల వంటి శాకాహార జంతువులు విరివిగా ఉన్నాయి. అలాగే మాంసాహార జంతువులైన ఆరు చిరుతపులులు, నక్కలు, రేస్‌కుక్కలు, తోడేళ్లు, హైనాలు ఉండడం ఈ అడవికి ప్రత్యేక గుర్తింపునిస్తోంది.
ఆర్నెళ్లు సంచరించిన పెద్దపులి
గతేడాది జనవరిలో కొడిమ్యాల అడవిలోకి పెద్దపులి వచ్చి దాదాపు ఆర్నెళ్ల పాటు ఇక్కడే సంచరిస్తూ నివాసం ఏర్పరచుకుంది. ఆ సమయంలో రెండు ఆ వులను వేటాడింది. తర్వాత ఫాజూల్‌నగర్ మార్గంగా కామారెడ్డిలోని అటవీ ప్రాంతాల వైపు వెళ్లిపోయింది. మాంసాహార జంతువులకు కూడా ఈ అడవి అనుకూలమని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.
సహజ సౌందర్యానికీ చిరునామా
కొడిమ్యాల రేంజ్ ఫారెస్ట్ వన్యప్రాణులతో పాటు సహజ సౌందర్యానికి కూడా నిలయమే. పిల్ల కాలువలు, ప్రశాంత వాతావరణం, భారీ వృక్షాలు ఈ అడవిని మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. ముఖ్యంగా పెద్దపెద్ద టేకు చెట్లు, విలువైన వృక్ష సంపద ఈ ప్రాంతానికి ప్రత్యేక శోభను తీసుకొస్తున్నాయి. జీవ వైవిధ్యం, విలువైన అటవీ సంపద, ప్రశాంత వాతావరణంతో కొడిమ్యాల రేంజ్ ఫారెస్ట్ అభయారణ్యానికి ఏమాత్రమూ తీసిపోదని చెప్పొచ్చు.
అడవుల్లో జంతుగణన


