అభ్యర్థుల వేట షురూ..
ప్రధాన పార్టీల నాయకులు కార్యకర్తలతో నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ ప్రతినిధులు పేర్కొంటుండగా.. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని బీఆర్‌ఎస్, బీజేపీ సూచిస్తున్నాయి.
టికెట్ల సంగతి ఎలా ఉన్నా.. ఎలాగైనా కౌన్సిలర్ పదవి దక్కించుకోవాలని అభ్యర్థులు వారి సొంత పేరునే ఉపయోగించుకుంటూ ప్రచారంలోకి దిగారు. కాలనీలో అందుబాటులో ఉంటానని, ఏ సమస్య అయినా పరిష్కరిస్తానని ముందుకెళ్తున్నారు.
జగిత్యాల: మున్సిపల్ చైర్మన్ స్థానాలతోపాటు వార్డులవారీగా రిజర్వేషన్లు ఖరారు కావడంతో ప్రధాన పార్టీలన్నీ గెలిచే అభ్యర్థుల కోసం వేట ప్రారంభించాయి. ఏడాది క్రితం బల్దియాల్లో పాలకవర్గం ముగిసిన అనంతరం స్పెషల్ అధికారుల పాలన వచ్చిన విషయం తెల్సిందే. ఈ ఏడాదిపాటు మున్సిపాలిటీల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు కదలలేదు. తాజాగా మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. ఈ క్రమంలో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో చైర్మన్, వార్డుసభ్యులుగా ఎవరిని నిలబెడదామన్న అంశంపై ప్రధాన పార్టీలన్నీ అంతర్గతంగా సమావేశాలు నిర్వహిస్తూ ముందుకెళ్తున్నాయి. గతంలో పోటీచేసి ఓడిపోయిన వారితోపాటు, గెలిచినవారిలో ఎవరిని బరిలోకి దింపితే బాగుంటుంది..? ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారు..? అనే దానిపై కసరత్తు చేస్తున్నాయి. ఎలాగైనా మున్సిపాలిటీల్లో జెండా ఎగురవేయాలని చూస్తున్నాయి. ఇప్పటికే మంతనాలు, సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్ ఐదు మున్సిపాలిటీల్లో పాగా వేయాలని చూస్తోంది. అభ్యర్థుల ఎంపికలో ఆచీతూచి అడుగులు వేస్తూ ఇప్పటికే ఒక్కోవార్డులో సర్వే చేయించింది. అభ్యర్థుల ఎంపిక ప్రధానంగా జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీనే సమస్యగా మారింది. కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉండనుండగా.. జగిత్యాల, రాయికల్‌లో మాత్రం అధికార పార్టీ మధ్యే ఇబ్బందిగా మారింది. ప్రధానంగా సీనియర్ నాయకులైన జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మధ్య రాజకీయ పోరు తారాస్థాయికి చేరుకుంటోంది. నిత్యం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంజయ్‌కుమార్.. అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని పేర్కొంటున్నారు. జీవన్‌రెడ్డి మాత్రం అభివృద్ధి కోసం ఏదైనా చేయొచ్చని, పార్టీలో జోక్యం చేసుకుంటే బాగుండదని హెచ్చరిస్తున్నారు. మరోవైపు బీ ఫాం లొల్లి కూడా మొదలైంది. ఇద్దరూ రెండు వర్గాలుగా విడిపోవడంతో బీ ఫాంలు ఏ వర్గానికి వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇద్దరికి చెరిసగం అంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనిని జీవన్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. గతంలో జగిత్యాల మున్సిపాలిటీ పీఠాన్ని బీఆర్‌ఎస్ గెలుచుకుంది. గతంలో ఉన్న బీఆర్‌ఎస్ క్యాడర్ ప్రస్తుతం సంజయ్‌వైపు ఉండడంతో ఆ పార్టీ కొత్తవారిని గుర్తించే పనిలో పడింది. ఈ విషయంలో ఇప్పటికే ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఇన్‌చార్జి వసంత ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ కూడా బలమైన అభ్యర్థులను నిలబెట్టి పట్టు సాధించే దిశగా ప్రయత్నిస్తోంది.
చైర్మన్ పీఠానికి పోటీ ఎక్కువే
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో జగిత్యాల బీసీ మహిళ, మెట్‌పల్లి, రాయికల్ జనరల్, కోరుట్ల, ధర్మపురి జనరల్ మహిళకు కేటాయించారు. జగిత్యాలలో బీసీ మహిళకు మళ్లీ అవకాశం రావడంతో చాలామంది పోటీలో నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి రాయికల్, మెట్‌పల్లి జనరల్ కావడంతో అక్కడ తీవ్రమై పోటీ నెలకొంది. కోరుట్ల, ధర్మపురి జనరల్ మహిళ కావడంతో ఎలాగైనా పురపీఠం దక్కించుకోవాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు.
సమీక్షల జోరు
అభ్యర్థుల ప్రచార జోరు


