డిప్యూటీ సీఎంపైనే ఆశలు
● సుమారు రూ.12 కోట్లతో మాతాశిశు ఆస్పత్రిని 2023లో నిర్మించారు. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో లాంఛనంగా ప్రారంభించారు. అప్పటికే ఉన్న కొద్దిపాటి పెండింగ్ పనులు పూర్తయినా సిబ్బందిని నియమించకపోవడంతో రెండేళ్లుగా నిరుపయోగంగా ఉంటోంది. ఆస్పత్రిని వినియోగంలోకి తెస్తే ధర్మపురి చుట్టూ ఉన్న ఐదు మండలాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.
● రాయపట్నం, తుమ్మెనాల గ్రామాల్లో రూ.50లక్షలతో చేపట్టిన ఆర్చి పనులు పెండింగ్‌లో ఉన్నాయి.
● లక్ష్మినృసింహస్వామి ఆలయ అభివృద్ధికి అప్పటి ప్రభుత్వం రూ.వంద కోట్లు ప్రకటించింది. అందులో సుమారు రూ.46కోట్లు విడుదల చేసింది. అందులో కేవలం రూ.9కోట్లతో అభివృద్ధి పనులను నామమాత్రంగా చేసి వదిలేశారు. మిగిలిన రూ.కోట్లు విలువ చేసే పనులన్నీ టెండర్ల దశలో ఉన్నాయి. దీంతో పుణ్యక్షేత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు.
● పట్టణంలో చేపడుతున్న రోడ్ల విస్తరణ పనులు ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయి. రూ.కోట్లు వెచ్చించినా పనులు పూర్తికావడం లేదు. దీంతో పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు కంకరరోడ్డుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
● పట్టణం నుంచి వెలువడే మురికినీరంతా గోదావరిలోనే కలుస్తోంది. ఈ సమస్య భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. పరిష్కారానికి చర్యలు చేపట్టాలని భక్తులు పదేపదే కోరుతున్నారు.
● ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లే రహదారి, కమలాపూర్ రహదారి, దమ్మన్నపేట్ వెళ్లే రహదారులు అధ్వానంగా మారాయి. వీటిని అభివృద్ధి పరిస్తే ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి రాకతో ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని స్థానిక ప్రజలు ఆశిస్తున్నారు.
వినియోగంలోకి రాని మాతాశిశు ఆస్పత్రి నృసింహుని సన్నిధిలో పనులన్నీ పెండింగ్ ధర్మపురికి రేపు ఉప ముఖ్యమంత్రి రాక
ధర్మపురి: పట్టణంలో గత ప్రభుత్వ హయాంలో కోట్లాది నిధులతో ప్రారంభించిన పలు అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చి రెండేళ్లు పూర్తయినా ఆ పనులకు మోక్షం మాత్రం కలగడం లేదు. ఈనెల 21న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ధర్మపురి పుణ్యక్షేత్రాన్ని సందర్శించనుండడంతో పనులకు మోక్షం కలుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. ప్రాచీన పుణ్యక్షేత్రమైన ధర్మపురికి దక్షిణకాశీగా పేరుంది. ఇక్కడ గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ చొరవతో కోట్లాది నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. అందులో చాలావరకు పూర్తయినప్పటికీ ఉపయోగంలోకి రాకుండా పోయాయి.
ఈనెల 21న ఉపముఖ్యమంత్రి రాక..
ధర్మపురి పుణ్యక్షేత్రానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రానున్నందను ఈ సమస్యలన్నిటినీ ఆయనకు వివరిచేందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సిద్ధమవుతున్నారు. అలాగే మంత్రి చొరవతో కోట్లాది నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు. మండలంలోని తుమ్మెనాల గ్రామ సమీపంలో రూ.200 కోట్లతో చేపట్టనున్న యంగ్ ఇంటిగ్రేటెడ్ నిర్మాణం, గోదావరిలో మురుగునీరు కలకుండా రూ.17కోట్లతో సీనరేజ్ ప్లాంటు ఏర్పాటు వంటి పనులు ఉన్నాయి.
అధ్వానంగా గోదావరి ప్రధాన మార్గం
ధర్మపురిలో నిరుపయోగంగా మాతాశిశు ఆస్పత్రి
1/1
డిప్యూటీ సీఎంపైనే ఆశలు