
కోతులు..రామచిలుకలు
జగిత్యాలఅగ్రికల్చర్: రైతన్నలు రాత్రింబవళ్లు కష్టపడి పంట పండించడం ఒక ఎత్తైతే.. ఆ పంటను కోతులు, రామచిలుకలు, అడవిపందుల నుంచి కాపాడటం మరో ఎత్తుగా మారింది. ప్రస్తుతం మొక్కజొన్న పంట గింజ దశకు చేరుకోగా.. కోతులు, రామచిలుకలు నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు ఇంటి వద్ద కంటే తోటల వద్దే ఉంటూ కాపు కాయాల్సిన పరిస్థితి దాపురించింది. సుమారు 200 నుంచి 300 కోతులు మందలుగా.. రామచిలుకలు గుంపులుగుంపులుగా వస్తుండటంతో రైతులు పగలు, రాత్రి తేడా లేకుండా తోటల వద్ద కాపలా కాయాల్సి వస్తోంది. ఇందుకోసం మంచెలు ఏర్పాటు చేసుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు.
మొక్కజొన్న వేయాలంటేనే భయం
తొలకరి వర్షాలు కురవగానే పెసర, మొక్కజొన్న, వేరుశెనగ వంటి పంటలు వేశారు. మొక్కజొన్న పంట ఒక్క జిల్లాలోనే దాదాపు 50వేల ఎకరాలకు పైగా సాగవుతోంది. ప్రస్తుతం పంట గింజ దశకు చేరుకుంది. ఓ వైపు రామచిలుకల బెడద, మరోవైపు అడవి పందుల బెడద, ఇంకోవైపు కోతుల బెడద రైతులకు కునుకు లేకుండా చేస్తోంది. జిల్లా ఎక్కువగా గుట్టలు ఉన్న ప్రాంతం కావడం.. హరితహారం కింద ప్రతి చిన్న రోడ్డు వెంబడి విపరీతంగా మొక్కలు నాటడంతో అవి ఏపుగా పెరిగాయి. దీంతో పొద్దంతా కోతులు, రామచిలుకలు, రాత్రి సమయంలో అడవిపందులు పంటను నష్టపరుస్తున్నాయి. ఫలితంగా మొక్కజొన్న సాగు చేయాలంటేనే ఇక్కడి రైతులు భయపడుతున్నారు. మొక్కజొన్నలో అంతరపంటగా పసుపు వేసిన రైతులకు దుఃఖం తప్పడం లేదు.
పంటను కాపాడుకునేందుకు తంటాలు
చాలా గ్రామాల్లో రైతులు కోతుల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు రూ.50 వేల వరకు ఖర్చు పెట్టి సోలార్ కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. కొంతమంది రైతులు కుక్కలను పెంచుతున్నారు. మరికొంత మంది రైతులు సెల్‌ఫోన్లలో కుక్కల అరుపులను రికార్డు చేసి.. చెట్లకు తగిలిస్తున్నారు. కొందరు రైతులు తోట చుట్టూ వలలు ఏర్పాటు చేసుకుంటున్నారు. రామచిలుకలు వెళ్లిపోయేందుకు టపాసులు కాల్చుతున్నారు. అడవి పందుల కోసం చీరలు కడుతున్నారు. రాత్రి వేళ మంటలు పెడుతున్నారు. పంటలను కోతులు, రామచిలుకలు, అడవిపందుల బారి నుండి కాపాడేలా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలని, ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలని రైతులు కోరుతున్నారు.
మొక్కజొన్న గింజలను
తింటున్న రామచిలుకలు
రాయికల్ మండలంలో కాపాల ఉండేందుకు
మంచెలను ఏర్పాటు చేసుకున్న రైతులు

కోతులు..రామచిలుకలు