
‘కొనసాగింపు’లో కొత్త కిరికిరి
కథలాపూర్: రైతులకు రుణాలు అందించడం.. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించడంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాత్ర కీలకం. వీటితోపాటు సంఘాలు ఎరువులు, విత్తనాలు కూడా అందిస్తున్నాయి. ఈ సంఘాలకు ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహిస్తూ పాలకవర్గాలను ఎన్నుకుంటారు. సంఘాల పాలకవర్గాల గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 14న ముగిసింది. దీంతో ఆర్నెళ్లపాటు పదవీకాలాన్ని పొడిగించింది. ఆ గడువు కూడా ఈనెల 14తో ముగిసింది. అయితే మరోసారి పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కొన్ని నిబంధనలు కొత్త కిరికిరికి దారితీశాయి. ఫలితంగా పాలకవర్గాల కొనసాగింపుపై సందిగ్ధం నెలకొంది.
51 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు
జిల్లాలో 51 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. ఇందులో 85 వేల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. సంఘంలోని సభ్యులకు సకాలంలో పంట రుణాలు, వాహనాల రుణాలు అందించి ప్రోత్సహిస్తున్నారు. మరికొన్ని సంఘాలు వ్యాపారాలు నిర్వహిస్తూ ఆర్థికంగా రైతులకు సహకారం ఇస్తున్నారు.
బకాయిలు చెల్లించకుంటే అంతే..
సాధారణంగా సహకార సంఘాల్లో 13 మంది డైరెక్టర్లు ఉంటారు. ఇందులో ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. కొత్త నిబంధనల ప్రకారం సహకార సంఘాల పనితీరు మెరుగ్గా ఉంటేనే పాలకవర్గాల పదవీకాలం పొడిగింపు ఉంటుంది. రుణాలు తిరిగి చెల్లింపులు సక్రమంగా ఉండాలి. బకాయిలు చెల్లించని డైరెక్టర్, అధ్యక్షుల పదవీకాలం పొడిగింపు ఉండదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎలాంటి నిబంధనలు విధించకపోగా.. ఈసారి అందుకు భిన్నంగా ప్రభుత్వం మెలిక పెట్టిన తీరుపై పాలకవర్గాల సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కొత్త నిబంధనల ప్రకారం వివరాల సేకరణ
ప్రభుత్వం జారీ చేసిన కొత్త ఆదేశాల ప్రకారం పాలకవర్గాల జాబితాలను సిద్ధం చేసే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. సహకార సంఘాల వారీగా డైరెక్టర్ల, అధ్యక్షుల రుణాల వివరాలు సేకరిస్తున్నారు. పొడిగింపునకు అర్హత గల సహకార సంఘాల నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు పంపేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రస్థాయి అధికారుల ఆదేశాలు రాగానే పొడిగింపునకు అర్హత గల పాలకవర్గాలకు ఉత్తర్వులు జారీ చేస్తారు. పొడిగింపునకు అర్హతలేని సహకార సంఘాలకు ప్రత్యేకాధికారులను నియమించనున్నారు. కొత్త నిబంధనల ప్రకారం అధికంగా రుణలు తీసుకుని చెల్లించని డైరెక్టర్లు పదవి ఉంటుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు.